నిజామాబాద్: ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లో రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని నిజామాబాద్ ఎంపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ కుమార్ జోస్యం చెప్పారు. నిజామాబాద్‌లోని వేల్పూరు రోడ్ షోలో బిజెపి అభ్యర్థి అర్వింద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుకుంటే ప్రభుత్వం పడిపోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ నేతలే పడేసుకుంటారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోడీకి ప్రజలు ఓట్లు వేస్తున్నారని, ఎన్నికలు కాగానే తెలంగాణ ప్రభుత్వం పడిపోతుందని అరవింద్ కుమార్ జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకుందని, దేశంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పడిపోతుందని, తప్పుడు హామీలతో గద్దెనెక్కి ప్రజలను కాంగ్రెస్ మోసగించిందని అర్వింద్ కుమార్ దుయ్యబట్టారు. ఐదేళ్లలో ఎంపిగా తనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని, తన కంటే ముందు ఎంపిగా ఉన్న కవిత ఇప్పుడు జైళ్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. అవినీతి చేసే రోజు వస్తే రాజకీయాలు వదిలేస్తా తప్ప తప్పు చేయనని, ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకొచ్చామని, తెలంగాణ సహకరిస్తే జక్రాన్ పల్లి ఎయిర్‌పోర్ట్ ఏడాదిలోపు తెరుచుకోవచ్చని, తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకపోవడంతో మన పనులు కావడం లేదని ధ్వజమెత్తారు.