Monday, January 20, 2025

రాష్ట్రంలో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనలు….

- Advertisement -
- Advertisement -

బిజెపి, బిఆర్‌ఎస్‌లకు ధీటుగా ప్రచార సభలు…
తుక్కుగూడలో జరిగిన జనజాతర సభతో ఎన్నికల ప్రచారం మొదలై,
27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలతో
ప్రచారాన్ని హోరెత్తించిన సిఎం రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ బిజెపి, బిఆర్‌ఎస్‌లకు ధీటుగా ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. పార్టీ ప్రచారం మొత్తం తన భుజ స్కందాలపై వేసుకొని ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 6వ తేదీన తుక్కుగూడలో జరిగిన జనజాతర సభతో తన ఎన్నికల ప్రచారం మొదలు పెట్టి, మొత్తం 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కొన్నిసార్లు ఒక్క రోజులోనే 4 మీటింగ్‌లతో వివిధ నియోజకవర్గాల్లో రేవంత్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీలతో కలిసి ముఖ్యమంత్రి కొన్ని ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి వాగ్ధాటిని ప్రజల్లో ఆయనకు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారాన్ని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించి ఇతర రాష్ట్రాలకు సైతం ఆయన్ను ప్రచారానికి పంపించింది.

ఇతర రాష్ట్రాల్లోనూ రేవంత్ ప్రచారం

రాష్ట్రంలో ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ దానిని పక్కన పెట్టి కర్ణాటక, కేరళల్లో సైతం పర్యటించి అక్కడి పబ్లిక్ మీటింగ్, రోడ్ షోల్లో ఆయన పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్‌గాంధీ నామినేషన్ కార్యక్రమానికి సైతం సిఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రచారం మధ్యలో వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి పత్రికలకు, ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా తన వాగ్ధాటితో ఆయన ప్రజలను అకట్టుకుంటున్నారు. కెసిఆర్, మోడీ పాలనా వైఫల్యాలపై పదునైన అస్త్రాలు సంధించి ఓటర్లలో రేవంత్‌రెడ్డి చైతన్యం తీసుకొచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రచార సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా బిజెపి అధికారంలోకి వస్తే దేశానికి జరుగబోయే నష్టం గురించి ఆయన చేసిన ప్రసంగాలు సంచలనం సృష్టించాయి.

బిజెపిపై రేవంత్ ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు

బిజెపి గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై మోడీ, అమిత్ షా నుంచి బిజెపి నాయకులందరూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై చేస్తున్న విమర్శలకు ధీటుగా రేవంత్‌రెడ్డి బదులిచ్చారు. పదేళ్ల పాటు బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రానికి నిధులు, అభివృద్ధి పనులకు అనుమతులు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఉన్నత విద్యాసంస్థల స్థాపనలో నిర్లక్ష్యం వంటి వాటిని రేవంత్ బలంగా ఎత్తి చూపారు.

రాష్ట్రానికి ఏమీ చేయని బిజెపిని ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రజలను ప్రశ్నించారు. అదేవిధంగా రాష్ట్రానికి బిజెపి “గాడిద గుడ్డు” తప్ప ఏమిచ్చింది అన్న ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఆగస్టు 15వ తేదీలోపు తప్పనిసరిగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, రైతులకు భరోసా ఇచ్చిన అంశం హైలెట్‌గా నిలిచింది. బిఆర్‌ఎస్ తమకు పోటీ కాదని, ఈ ఎన్నికలు బిజెపి, కాంగ్రెస్‌ల మధ్యనే జరుగుతున్నాయని ప్రజల్లోకి తీసుకెళ్లిన సిఎం రేవంత్, ప్రధాన ప్రత్యర్థి బిజెపిని కట్టడి చేసి రాష్ట్రంలో 14 సీట్ల వరకు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News