మనతెలంగాణ/హైదరాబాద్/మహబూబ్‌నగర్ కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల నుంచి అందిస్తున్న నిధులను గత బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎటిఎంలా వాడుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రాజెక్టుల కోసం లక్షల కోట్ల నిధులు ఇస్తే సద్వినియోగం చేసుకోలేదని, వాటిని ఏటిఎంలా వాడుకుని అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తెలంగాణకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏమిచ్చింది గాడిద గుడ్డు అంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రచారాన్ని మోడీ తిప్పికొట్టారు. తెలంగాణకు నాలుగు వందే భారత్ రైళ్లు, బీబీనగర్ ఎయిమ్స్, గిరిజన యూనివర్శిటీ, ఫెర్టిలైజర్స్ పరిశ్రమ, పసుపు బోర్డు మరెన్నో కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న భారత దేశం గెలుస్తుందని, జూన్ 4 తర్వాత భారత విరోధులు పారిపోక తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. బీజపీని గెలిపించాలని 140 కోట్ల మంది ప్రజలు సంకల్పం తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. 2012లో దిల్‌షుక్‌నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగాయని గుర్తు చేస్తూ ఇప్పుడు జరుగుతున్నాయా..? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో ఎక్కడికి వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండేదని, గత పదేళ్ల కాలంలో అలాంటి పరిస్థితిని చూశారా? అని మోడీ ప్రశ్నించారు. ఢిల్లీలో బలమైన ప్రభు ఉండడం వల్లే పేలుళ్లు ఆగాయని అన్నారు. ఢిల్లీలో బలమైన ప్రభుత్వం ఉండడం కొందరికి ఇష్టం లేదని అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచా ర ఘట్టంలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులతో కలిసి శుక్రవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే ఉగ్రవాదం విస్తరించి పేలుళ్లు ప్రారంభమవుతాయని విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే దేశం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఓట్లు వేయాలని మోడీ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఎంతోమంది బాంబు పేలుళ్లలో అమాకులు బలైపోయారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వద్దు, బిఆర్‌ఎస్ వద్దు, ఎంఐఎం వద్దు బిజెపి మాత్రమే కావాలని ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 4 తర్వాత భారత విరోధులు, ఉమ్మడి పౌరస్మృతి విరోధులు, ఆర్టికల్ 370 రద్దు వ్యతిరేకులు, ఓట్ జిహాద్ వాళ్లు దేశం విడిచి పారిపోక తప్పదని ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, హస్తం ప్రభుత్వం వచ్చాక అదే లూటీ చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్‌ఆర్ ట్యాక్స్‌కు తోడు మరో ఆర్ ట్యాక్స్ రజాకర్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. పాత బస్తీలో రజాకార్ ట్యాక్స్ ఎలా వసూలు చేస్తారనేది అందరికి తెలిసిందేనని ఆరోపించిన మోడీ పాత బస్తీలో కనీస సౌకర్యాలు కూడా లేవని అన్నారు. చిన్న వర్షానికే నగరం నీట మునుగుతోందని చెప్పారు. ఈ సమస్యలు పరిష్కరించమంటే మాత్రం పరిష్కరించడంలేదని అన్నారు. వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాయని విమర్శించిన ఆయన దేశానికి కావాల్సింది వారసులు కాదని బలమైన, భద్రతతో కూడిన ప్రభుత్వాన్ని నడిపే వారని పేర్కొన్నారు. సంపద కాపాడి మీ వారసులకు అదించే వారు కావాలా..? లేక సంపదను లాక్కునే వారు కావాలా..? ఆలోచించుకోవాలని మోడీ ప్రజలకు సూచించారు. రాముడిని పూజించడం తప్పా..? అని అన్నారు. ఢిల్లీ యువరాజుకు ట్యూషన్ చెప్పే నేత శ్రీరామనవమి వద్దని చెప్పారట అంటూ ఎద్దేవా చేశారు. సభా వేదికపై ఉన్న హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బిజెపి ఎంపి అభ్యర్థి మాధవీలత, సికింద్రాబాద్ ఎంపి అభ్యర్థి జి కిషన్‌రెడ్డి, చేవెళ్ల ఎంపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపి అభ్యర్థి ఈటల రాజేందర్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ అభివృద్ధికి లక్షల కోట్లు ఇచ్చినా దుర్వినియోగం చేశారుః మోడీ
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి లక్షల కోట్ల నిధులు ఇచ్చినా దుర్వినియోగం జరిగిందని, అభివృద్ధిని సాధించలేకపోయారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత పదేళ్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ బిజెపి అభ్యర్థి డీకే ఆరుణకు మద్దతుగా నారాయణపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ’నా పాలమూరు సోదరసోదరీమణులకు హృదయపూర్వక నమస్కారాలు, జోగులాంబ తల్లి పాదాలకు నమస్కరిస్తున్నా’ అంటూ తెలుగులో మోడీ ప్రసంగం ప్రారంభించారు. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ, మోదీ గ్యారంటీ అంటే దేశ భద్రతకు గ్యారంటీ అని, మోదీ గ్యారంటీ అంటే విశ్వవేదికపై భారత గౌరవానికి గ్యారంటీ, మోదీ గ్యారంటీ అంటే ఇచ్చిన హామీలు నెరవేరతాయని ఆయన పేర్కొన్నారు. తాము ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ఆయన దుయ్యబట్టారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్‌ఎస్ దారిలోనే లూటీ చేస్తోందని మండిపడ్డారు. అవినీతిలో బిఆర్‌ఎస్ జిరాక్స్‌గా కాంగ్రెస్ మారిందని ఎద్దేవా చేశారు.
ఆర్‌ఆర్ ట్యాక్స్ విషయంలో తాను ఎవరి పేరు చెప్పలేదని, అయినప్పటికీ ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రేవంత్ స్పందించటం చూస్తే, ఆర్‌ఆర్ ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తున్నారో అర్థమవుతోందన్నారు. మహబూబ్‌నగర్ ప్రాంతాన్ని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు తమ స్వార్థానికి వాడుకున్నారని దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్ ప్రాంతానికి కృష్ణా, తుంగభద్ర నదుల ఆశీర్వాదం ఉందని, మహబూబ్‌నగర్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.వేల కోట్లు ఇచ్చినప్పటికీ సద్వినియోగం కాలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ఇన్నేళ్లలో చేసిన అవినీతిని కాంగ్రెస్ కొన్ని నెలల్లోనే చేసిందని ఆరోపించారు. ఇండస్ట్రీల పేరిట కాంగ్రెస్ ఫేక్ వీడియోల మాన్యుఫ్యాక్చరింగ్ దుకాణాన్ని తెరిచిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన కుంభకోణంపై చేపట్టి విచారణలో ఎలాంటి ముందడుగు పడటం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. అయోధ్య రాముడిని దర్శించుకోవడాన్ని దేశ ద్రోహంగా పరిగణించి సర్టిఫికెట్ ఇవ్వాలని చూస్తున్నారని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. హిందువులను హిందువుల దేశంలో రెండో తరగతి పౌరులుగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు.
మాదిగలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో వారి గొంతుకను వినేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధంగా లేదన్న మోడీ మాదిగలు కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాదు కాబట్టే వారికి వారి హక్కులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ముందు నుంచే హిందు విరోధి పార్టీ అని వ్యాఖ్యానించారు. ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించినట్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా కల్పించాలని చూస్తోందన్నారు. మహబూబ్‌నగర్ బిజెపి అభ్యర్థి డీకే అరుణకు మీరు వేసే ప్రతి ఓటు నేరుగా మోడీకి వేసిట్లేనని పేర్కొన్నారు. అరుణను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళ అని కూడా చూడకుండా ఘోరంగా అవమానించి విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.