భూమిని తాకిన అసాధారణ తీవ్రమైన సౌర తుపాను ఈ వారాంతంలో అమెరికాలో ఉత్తర జ్యోతుల ప్రజ్వలనకు అవకాశం ఉంది. అది విద్యుత్, కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించవచ్చు. ఊహించినదాని కన్నా కొన్ని గంటల ముందుగానే శుక్రవారం మధ్యాహ్నం సౌర తుపాను భూమిని తాకినప్పుడు యుఎస్ జాతీయ సాగర, పర్యావరణ ప్రాధికార సంస్థ (ఎన్‌ఒఎఎ) అరుదైన తీవ్ర జియోమాగ్నెటిక్ తుపాన్ హెచ్చరిక జారీ చేసింది. దాని ప్రభావం ఈ వారాంతంలోనే కాకుండా వచ్చే వారంలో కూడా ఉండనున్నది.
విద్యుత్ ప్లాంట్లు, కక్షలోని రోదసీ నౌకల నిర్వాహకులను, ఫెడరల్ ఎమర్జన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీనిఎన్‌ఒఎఎ అప్రమత్తం చేసింది. ‘భూ గ్రహంపై గల ప్రజలలో అధిక సంఖ్యాకులు చేయవలసింది ఏమీ ఉండదు’ అని ఎన్‌ఒఎఎ అంతరిక్ష వాతావరణ సూచన కేంద్రంలోని శాస్త్రవేత్త రాబ్ స్టీన్‌బర్గ్ తెలిపారు. సౌర తుపాను యుఎస్‌లో దక్షిణాన అలబామా, కాలిఫోర్నియా వంటి ప్రాంతాల వరకు ఉత్తర జ్యోతుల ప్రజ్వలన ఉండగలదని ఎన్‌ఒఎఎ సూచించింది.