ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు స్వస్థలాలకు తరలి వెళ్తుండటంతో చౌటుప్పల్‌లోని పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. పలుచోట్ల ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ ఆలస్యం అవుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాహనాలు కిలో మీటర్ల మేర బారులు తీరాయి. మరోవైపు హైదరాబాద్- టు విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీగా నెలకొంది. శివారు ప్రాంతాల్లో నివాసం ఉండే ఓటర్లు తమ సొంత వాహనాల్లో ఔటర్ మీదుగా అబ్ధుల్లాపూర్ మెట్ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఇలా ఔటర్‌పైకి భారీగా వాహనాలు చేరుకోవడంతో 5 కిలో మీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జాం అయ్యిందని అధికారులు పేర్కొన్నారు.
ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా, ఓటేసేందుకు ఎపికి వెళుతుండటంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ముఖ్యంగా సొంత వాహనాల్లో వెళ్లే వారితో హైదరాబాద్ టు -విజయవాడ హైవేపై పలుచోట్ల ట్రాఫిక్ జాం అవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. కొర్రపాడు టోల్ గేట్ దగ్గర నాలుగు టోల్ బూతులను తెరిచి విజయవాడ వైపు వాహనాలను పంపించారు. వరుస సెలవులు రావడంతో కార్లు, బస్సుల్లో ప్రయాణికులు తరలివెళ్తున్నారు. మండే ఎండలో కూడా వాహనాల రద్దీ అధికంగా ఉందని అధికారులు తెలిపారు.