Thursday, December 19, 2024

మైకులు బంద్… రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. గత నెల రోజులుగా సాగుతున్న ప్రచారానికి శనివారం బ్రేక్ పడింది. మైక్‌లు బంద్ అయ్యాయి. ఎన్నికలకు 48 గంటల ముందు సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగించాలన్న ఇసి ఆదేశాల మేరకు, అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముగించాయి.

రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. సోమవారం(మే 13) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, వచ్చేనెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాల బరిలో 525 మంది అభ్యర్థులు ఉన్నారు. 51 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 35,809 పోలింగ్ కేంద్రాల్లో 1,09,941 ఇవిఎం యూనిట్లు సిద్ధం చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాలకు కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ పోటీ చేస్తున్నాయి. అగ్రనేతలు, ముఖ్యనేతలతో పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహించాయి. కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలు, బహిరంగ సభల్లో విస్తృతంగా ప్రచారాన్ని హోరెత్తించాయి. ప్రచార గడువు సాయంత్రంతో ముగియడంతో స్థానికేతరులు జిల్లాల నుంచి వెళ్లిపోవాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. సమస్యాత్మక ప్రాంతాలైన ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో, సాయంత్రం 4 గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది.

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ సెగ్మెంట్ పరిధిలో ప్రచారానికి బ్రేక్ పడింది. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సాయంత్రం 4 గంటలకే ప్రచారనికి తెరపడింది.

తప్పుడు ప్రచారంపై నిఘా
ప్రచారం ముగియగానే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతుండటంతో ఎన్నికల కమిషన్ అప్రమత్తంగా ఉంటోంది. ప్రలోభాలు, హింసాత్మక ఘటనలపై నిఘా పెంచామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ ఇప్పటికే స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, తప్పుడు ప్రచారంపై నిఘా కొనసాగుతోంది. అక్రమ మద్యం, డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. సాయంత్రం 5 నుంచి ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే సీఈవో వికాస్‌రాజ్ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News