వచ్చే రెండు నెలల్లోనే ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యానాథ్‌ను పదవినుంచి తప్పిస్తారని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఎన్నికల్లో ఒకవేళ ప్రధాని మోడీ గెలిస్తే ఇక ఆయన దూకుడుకు అంతముండదని, ఆయనలోని నియంతను అంతా చూస్తారని కేజ్రీవాల్ చెప్పారు. ప్రధాని మోడీ కేవలం తన కోసం తాను ఒన్ నేషన్ ఒన్ లీడర్ పద్థతికి దిగుతారు. ఈ క్రమంలో తన పర అనేభేదం లేకుండా తనకు ఎవరు పోటీ అనుకుంటే వారిపై విరుచుకుపడుతారని, ఈ క్రమంలో కొందరు బిజెపి నేతలు కూడా ఆయన ఆగ్రహానికి గురవుతారని , ఇందులో యోగి ఆదిత్యానాథ్ కూడా ఒక్కరని తెలిపారు.
విపక్ష నేతలను కటకటాల పాలు చేస్తారు. కొందరు స్వపక్ష నేతలకూ ఈ శిక్ష తప్పదేమో అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అయితే ఈ దేశం మహత్తరమైనది, అత్యంత పురాతనమైనది, ఎప్పుడైతే నియంత మితిమీరడం జరుగుతుందో , ప్రజలు ఆ నియంతను ఎదుర్కొని తోకముడిచేలా చేస్తారు. ఇప్పుడు కూడా ఓ నియంత ప్రజాస్వామ్య అంతానికి తరలివస్తున్నాడని తాను ఈ నేపథ్యంలో 140 కోట్ల మంది భారతీయులకు తెలియచేయదల్చుకున్నానని, వారి స్పందనకు వేడుకుంటున్నానని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేజ్రీవాల్ తెలిపారు.