ప్రగతి సాధించాలంటే రాజకీయంగా, భౌగోళికంగా, పర్యావరణ పరంగా ఎలాంటి ప్రతిబంధకాలు ఉండకూడదు. ఏదైనా పరిశోధన చేపట్టినప్పుడు లేదా అభివృద్ధి ప్రణాళికలు చేపట్టినప్పుడు విశాల బహు ప్రజాప్రయోజన దృష్టితోనే ముందుండాలి తప్ప సంకుచిత రాజకీయ వర్గ విభేదాలకు తావీయరాదు. రాజకీయ సంక్షోభాలు, పర్యావరణ మార్పుల బారి నుంచి విత్తనాలను సురక్షితంగా ఉంచడానికి ఆరువేల రకాల పంటలతో పాటు, సాంస్కృతికంగా ముఖ్యమైన మొక్కలను భద్రంగా ఉంచడానికి ఇద్దరు శాస్త్రవేత్తలు చేసిన అపూర్వమైన కృషికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది.
ప్రపంచ విత్తన భాండాగారం ఏర్పాటులో బ్రిటన్‌కు చెందిన జెఫ్రీహాటిన్, అమెరికాకు చెందిన క్వారీఫౌలర్ నిర్విరామ కృషిని సాగించారు. ఆర్కిటిక్ సర్కిల్‌లో నార్వేకు చెందిన ఒక దీవి లో పర్వతం పక్కన వీరు విత్తన భాండాగారం ఏర్పాటు చేయడం విశేషం. స్వాల్‌బార్డ్ గ్లోబల్ సీల్డ్ వాల్ట్ అనే ఈ కేంద్రాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు 2008లో ప్రారంభించారు. ప్రతి దేశం నుంచి 12.5 లక్షల విత్తన నమూనాలను భద్రపరిచారు. అందుకే ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి వీరిద్దరూ ఎంపిక కావడం చెప్పుకోదగినది. ఈ సందర్భంగా ప్రపంచ విత్తర భాండాగారంగా 2021లోనే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఎఫ్‌ఎవొ చే గుర్తింపు పొందిన తెలంగాణ విత్తన ఘన చరిత్రను గుర్తు తెచ్చుకోవడం ఎంతైనా అవసరం.
భౌగోళికంగా, పర్యావరణ పరంగా తెలంగాణ భూమి పంటలు పండించడానికి చాలా అనుకూలమైనది. దీన్ని తెలుసుకుని రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వపరంగా విత్తన తయారీకి, అభివృద్ధికి జరిగిన కృషి సత్ఫలితాలను అందించింది. సీడ్‌బౌల్ ఆఫ్ ఇండియాగా కీర్తి సాధించింది. దేశంలో ఈ గుర్తింపు పొందిన ఏకైక రాష్ట్రం తెలంగాణయే. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తికి, విత్తన నిల్వలకు తగిన అనుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. దీనికి తోడుగా నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారు. ఇక కార్మిక శక్తికి కొదవలేదు. పట్టుదలతో కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేయగలిగారు. రాష్ట్రంలోని విత్తన సంస్థలను, విత్తన క్షేత్రాలను బలోపేతం చేయడానికి సీడ్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటైంది.
ఈ మహత్తర లక్ష సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐసిఎఆర్ భారత పరిశోధన సంస్థ, జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ, భారత నూనెగింజల పరిశోధన సంస్థ, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధ్రువీకరణ సంస్థ, వ్యవసాయశాఖ పాలు పంచుకుంటున్నాయి. వీటన్నిటికీ తోడు అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఇక్రిశాట్ కూడా అందుబాటులో హైదరాబాద్‌లోనే ఉండడం చెప్పుకోదగినది. గత 30 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో 1500కు పైగా గ్రామాల్లో సాంకేతిక అనుభవం, నైపుణ్యం కలిగిన 3 లక్షల మందికి పైగా రైతులు విత్తనోత్పత్తిలో నిమగ్నమయ్యారు. వీరంతా 7 లక్షలకు పైగా ఎకరాల్లో నాణ్యమైన విత్తన ఉత్పత్తి చేస్తున్నారు. దేశానికి 35 లక్షల టన్నుల విత్తనాలు అవసరం కాగా, తెలంగాణ నుంచే 24 లక్షల టన్నుల విత్తనాలు సరఫరా అవుతుండడం గమనార్హం.
ప్రస్తుతం దేశంలో రూ. 20 వేల కోట్ల విలువైన విత్తనోత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతుల స్థాయిని మరింత పెంచాలని, 2030 నాటికి రూ.30 వేల కోట్ల విలువైన విత్తన ఎగుమతులను సాధించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఇందులో తెలంగాణ కీలక పాత్ర వహిస్తోంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం రూ. 10 వేల కోట్ల విలువైన విత్తన ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ ఎగుమతులను 20 వేల కోట్ల విలువ విత్తన ఎగుమతులు జరిగేలా లక్షం పెట్టుకుంది. రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో 3.50 లక్షల ఎకరాల్లో 7 లక్షల టన్నుల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. అలాగే హైబ్రిడ్ వరి విత్తనం ఒక లక్ష ఎకరాల్లో 70 వేల టన్నుల వరకు ఉత్పత్తి అవుతోంది. దేశంలో కావలసిన వేరుశెనగ విత్తనాల్లో నాలుగో వంతు అంటే 8000 టన్నుల వేరుశెనగ విత్తనాలు పాలమూరు జిల్లాలో ఉత్పత్తి అవుతున్నాయి.
దేశ పత్తి విత్తనాల అవసరాల్లో మూడో వంతు అంటే రూ. 700 కోట్ల విలువైన పత్తి విత్తనాలను జోగులాంబ గద్వాల్ జిల్లా అందిస్తోంది. ఈ జిల్లాలో 40 వేల మంది పత్తి విత్తన రైతులు 30 వేల ఎకరాల్లో 12,000 టన్నుల పత్తి విత్తనాలను ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 65 వేల ఎకరాల్లో దేశానికి కావలసిన 90% పశుగ్రాస జొన్నలు 360 టన్నులు, 140 టన్నుల సజ్జలు ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్నారు. ఇంతేకాదు తెలంగాణకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉత్పత్తి చేసిన 12 లక్షల టన్నుల విత్తనాలకు కావలసిన ప్రోసెసింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ విత్తన పరిశ్రమల ద్వారా 50 వేల మంది నైపుణ్యం కలిగిన కార్మికులు, 2 లక్షల మంది నైపుణ్యం లేని కార్మికులు, 50 వేల మంది ఇతర కార్మికులకు ఉపాధి లభిస్తోంది.