Friday, December 20, 2024

పిఒకెలో ప్రజాగ్రహజ్వాల

- Advertisement -
- Advertisement -

పాలకులు అసమర్థులైతే పాలన ఎలా ఉంటుందో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజాగ్రహాన్ని పరిశీలించి అర్థం చేసుకోవచ్చు. విద్యుత్, ఆయిల్, గ్యాస్, బంగారం, బొగ్గు, గ్రాఫైట్, బాక్సైట్ లాంటి అరుదైన వనరులు పుష్కలంగా ఉండడంతో పాటు నీరు సమృద్ధిగా లభిస్తున్నా అక్కడి ప్రజలు పాలకులపై తిరుగుబాటు చేసి రోడ్లపైకి వచ్చి 4 రోజులైంది. సబ్సిడీ ధరలతో గోధుమ పిండిని, విద్యుత్‌ను సరఫరా చేయాలని, పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు జాక్ ఆధ్వర్యంలో 4 రోజులుగా పూర్తిగా బంద్ పాటిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లు, హింసలో ఇప్పటి దాకా ముగ్గురు చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నెలకొన్న ఎమర్జెన్సీ పరిస్థితులపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు తక్షణమే 23 బిలియన్ల గ్రాంటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించా రు.

కాని పాకిస్థాన్ పాలకుల హామీని ప్రజలు విశ్వసించడం లేదు. గతంలో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని, తమ ప్రాంత వనరులతో కోట్ల బిలియన్లు ఆర్జించి పాకిస్థాన్ తమపై ఆర్థిక అణచివేతను అమలు చేస్తున్నదని, ఇది తొలగే దాకా తమ ఆందోళనలు ఆపమని జాక్ ప్రకటించింది. భారత దేశం తక్షణమే జోక్యం చేసుకుని తమకు స్వతంత్ర ప్రతిపత్తి ప్రకటించేలా చూడాలని కూడా జాక్ బహిరంగ ప్రకటన ఇచ్చింది. అయితే భారత దేశం మాత్రం అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా వస్తే తప్ప తాము బలవంతంగా పిఒకెను స్వాధీనం చేసుకోమని ఖరాకండీగా చెబుతున్నది. కాని పిఒకె భారత్‌లో అంతర్భాగమని ఎప్పటికైనా ఆ ప్రాంతం భారత దేశంలో విలీనం కాక తప్పదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. దీనితో పిఒకె అంశం మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇక్కడ వనరులన్నిటినీ పాకిస్థాన్ ప్రభుత్వ పాలకులు కాజేసి తమ దేశానికి లాభాలు అందించడమే కాక, మంచి నీరు, వైద్య సౌకర్యం వంటి కనీస మౌలిక వసతులు కల్పించకుండా తమను చాలా దీనంగా చూస్తున్నారని ప్రజలు తిరుగుబాటు చేపట్టారు. మరో వైపు పాక్ పన్నుల భారం, అధిక ద్రవ్యోల్బణం, గోధుమ ధరలు పెరగడం విద్యుత్ కొరతకు సంబంధించి ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడం తదితర ప్రధాన సమస్యలపై జమ్ముకశ్మీర్ జాయింట్ ఆవామీ కమిటీ ఈ నెల 10న శుక్రవారం బంద్‌కు, 11న లాంగ్ మార్చ్‌కు పిలుపు ఇవ్వడంతో ప్రజలు ఆందోళన చేపట్టారు. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య సంఘర్షణ తీవ్రమై రాళ్లు విసురుకోవడం, కాల్పులు జరగం వరకు దారి తీసింది. సైన్యం కాల్పులకు ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తలెత్తిన అల్లర్లలో ఒక పోలీస్ అధికారి సహా మరికొందరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ఆందోళన చేపట్టిన ప్రజలపై సైన్యం కాల్పులు జరపడాన్ని ఉద్యమకారుడు అంజాద్ మిర్జా తీవ్రంగా ఖండించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు స్వాతంత్య్రం కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజాందోళనలు మిన్నుముట్టడానికి చివరకు హింసాత్మకంగా మారడానికి పాకిస్థాన్ సాగిస్తున్న దోపిడీ విధానాలే కారణమని చెప్పక తప్పదు. స్థానిక మంగ్లా డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు నుంచి వచ్చే మొత్తం ఆదాయం పాకిస్థాన్ ప్రభుత్వమే తీసుకుంటోంది తప్ప ఒక్క పైసా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రభుత్వానికి అందించడం లేదు. మంగ్లా డ్యామ్ లో 1400 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వీటిలో 300 మెగా వాట్ల విద్యుత్ స్థానికంగా ఇస్తామని గతంలో స్థానిక ప్రభుత్వానికి పాక్ హామీ ఇచ్చినా ఆ హామీ నీటి మూటగానే మారింది.

అంతేకాకుండా ఈ విద్యుత్‌ను పాకిస్థాన్‌లోకి తరలిపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తోంది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రజలతో పోలిస్తే వారి కన్నా ఇక్కడి ప్రజలు ప్రతి యూనిట్‌పై అధిక ధర చెల్లించడం ప్రజల్లో అసంతృప్తిని రేపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలం లోయలో లభించిన 40 బిలియన్ డాలర్ల విలువైన అమూల్య రత్నాలను పాక్ వెలికితీసి విక్రయించుకొంది. ఏటా 300 కోట్ల పాకిస్థానీ రూపాయలకు సరిపడా పువ్వులు, వనమూలికలను పంటనంతా పాక్ కార్పొరేషన్లే అమ్ముకొంటున్నాయి. ఇదే కాకుండా ఏటా 20 లక్షల వృక్షాలను నరికేసి పాక్‌కు తరలించి అమ్ముకుంటున్నారు.

ఇన్ని విధాలుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ దోపిడీకి గురవుతున్నా స్థానిక మౌలిక సదుపాయాలు సమకూరడం లేదు. స్థానికంగా మంచి నీటి వ్యవస్థలు ఏర్పాటు కాలేదు. మురికి నీరే ప్రజలకు శరణ్యం. దీంతో ఏటా వేల మంది ఆస్పత్రి పాలవుతున్నారు. పాక్ దోపిడీ విధానాలపై విసుగెత్తిన ప్రజలు పాక్ పాలకులపై తరచుగా తిరుగుబాటు చేయడం పరిపాటి అవుతోంది. ఈ నేపథ్యంలోనే అవామీ యాక్షన్ కమిటీ ఆందోళనలు చేపట్టింది. స్థానిక మంగ్లా డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తమకు ఉచితంగా ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గోధుమలపై రాయితీలు కల్పించాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News