Saturday, December 21, 2024

అభివృద్ధి అంశాలపైనే మాట్లాడండి

- Advertisement -
- Advertisement -

ఇతర విషయాల ప్రస్తావన వద్దు
ప్రధాని మోడీకి ఖర్గే సూచన
4 దశల తరువాత పటిష్ఠ స్థితిలో ప్రతిపక్ష కూటమి
మోడీకి వీడ్కోలుకు జనం సిద్ధంగా ఉన్నారు

లక్నో : ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రచార సభల్లో ఇతర అంశాల గురించి కన్నా అభివృద్ధి వ్యవహారాల గురించి మాట్లాడాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం సూచించారు. ‘మటన్ చికెన్, హిందు ముస్లిం ’ ఆయన పదాలని, తమవి కాదని ఖర్గే అన్నారు. హిందు ముస్లిం అంశాల ప్రస్తావనను తాను ప్రారంభిస్తే ప్రజా జీవితానికి తాను అర్హుడను కానని ప్రధాని మోడీ ‘న్యూస్ 18’ ఇంటర్వూలో చెప్పిన తరువాత ఖర్గే ఆ వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో కలసి విలేకరుల గోష్ఠిలో ఖర్గే మాట్లాడుతూ, ‘గడచిన పది సంవత్సరాలోల తాను చేసిన కృషిపై ప్రదాని ఎందుకు వోట్లు అడగడం లేదు’ అని ప్రశ్నించారు.

హిందు, ముస్లిం మధ్య తాను ఎన్నడూ వివక్ష ప్రదర్శించలేదన్న ప్రధాన మోడీ ప్రకటనకు ఖర్గే స్పందిస్తూ, ‘ప్రధాని మటన్, బీఫ్, చికెన్, చేపలు, మంగళసూత్రం గురించి మాట్లాడలేదా? ఆ పదాలు నావి కావు ఆయనవి (ప్రధానివి)’ అని అన్నారు. ‘ఆ విషయాలు వదలివేసి, మీరు చేసిన కృషి గురించి ప్రజలకు చెప్పి, దానిపై వోట్లు అడగండి. మేము కాకుండా వారు మటన్ చికెన్ గురించి మాట్లాడుతుంటారు’ అని ఖర్గే పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నాలుగు దశల అనంతరం ప్రతిపక్ష ఇండియా కూటమి పటిష్ఠ స్థితిలో ఉందని, ప్రధాని మోడీకి వీడ్కోలు పలికేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఉద్ఘాటించారు. ‘దేశంలో నాలుగు విడతల పోలింగ్ ముగిసింది.

ఇండియా కూటమి అత్యంత పటిష్ఠ స్థితిలో ఉంది. నరేంద్ర మోడీకి వీడ్కోలు పలికేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పూర్తి నమ్మకంతో చెప్పగలను. ఇండియా కూటమి జూన్ 4న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది’ అని ఖర్గే స్పష్టం చేశారు. తమ కూటమి ఉత్తర ప్రదేశ్‌లోని 80 సీట్లలో 79 గెలుచుకుంటుందని ఎస్‌పి చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. ‘ఇండియా కూటమి ఉత్తర ప్రదేశ్‌లో 79 సీట్లు గెలచుకుంటుంది. అది కేవలం ఒక సీటు ‘క్యోటో’పై పోటీలో ఉంది’ అని అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ప్రధాని పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిని ఉద్దేశించి అఖిలేశ్ అలా అన్నారు. వారణాసిని జపాన్‌లోని రమణీయమైన క్యోటో వలె అభివృద్ధి చేస్తామని ప్రధాని, బిజెపి నుంచి ప్రకటనలు వచ్చాయి. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే అది రాజ్యాంగాన్ని మారుస్తుందని కూడా ఖర్గే ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News