అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్ 1 బి వీసాదార్లకు ఊరట దక్కింది. అమెరికా పౌరసత్వ , వలస సేవల విభాగం (యుఎస్‌సిఐఎస్) ఈ మేరకు పలు మార్గదర్శకాలను ఇప్పుడు వెలువరించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారు దేశంలో కొనసాగేందుకు అవకాశం కల్పించారు. హెచ్ 1 బి వీసాదార్లు ఉద్యోగాలు కోల్పోతే వారికి ఇప్పటివరకూ 60 రోజుల ఔదార్యపు సమయం ఉండనే ఉంది. ఇటువంటి వారికి మరిన్ని వెసులుబాట్లు కల్పించేలా మార్గదర్శక సూత్రాలను రూపొందించారు. కోవిడ్ తరువాత ఆర్థిక సంక్షోభం దశతో గూగుల్, టెస్లా, వాల్మార్ట్ ఇతర కంపెనీలలో పెద్ద ఎత్తున లేఆఫ్‌లు ప్రకటించారు. దీనితో వేలాది మంది వలసదార్లు అయిన ఉద్యోగులు ప్రత్యేకించి భారతదేశానికి చెందిన వందలాది మంది ఐటి విద్యావంతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
వీరు క్రమేపీ తమకు ఉండే గ్రేస్ పీరియడ్ కూడా ముగియనుండటంతో ఆందోళన చెందుతున్నారు.ఈ పరిస్థితిని గమనించి యుఎస్‌సిఐఎస్ పలు విధాలుగా నిబంధనలలో మార్పులకు తలపెట్టింది. గ్రేస్‌పీరియడ్ తరువాత కూడా వీరు కొనసాగేందుకు రంగం సిద్ధం చేశారు. ఉద్యోగాలు కోల్పోయి సంధిదశలో ఉన్నవారు వెంటనే గ్రేస్‌పీరియడ్ దశలోనే తమ నాన్‌ఇమిగ్రెంట్ స్థాయిని మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. తమ ఇప్పుడున్న పరిస్థితి గురించి వివరించుకుంటే దీనిని పరిశీలించి అధికారులు స్పందిస్తే వీరికి ఏడాది అమలులో ఉండే ఉద్యోగ అవకాశాల అనుమతి పత్రం (ఇఎడి) మంజూరు అవుతుంది. ఈ దశలో వీరు సరైన ఉద్యోగాలకు వెళ్లేందుకు వీలుంటుంది. ఈ విధంగా ఇటువంటి హెచ్ 1 బి వీసాదార్లు తమకు తాముగా అభ్యర్థనలకు దిగాల్సి ఉంటుంది.