Monday, November 25, 2024

4 దశలలో మొత్తం 66.95 శాతం పోలింగ్

- Advertisement -
- Advertisement -

ఓటింగ్‌లో పాల్గొన్న 45.10 కోట్ల మంది
4వ దశలో 69.16 పోలింగ్ నమోదు
తాజా గణాంకాలు వెల్లడించిన ఇసి

న్యూఢిల్లీ: మొత్తం నాలుగు దశల లోక్‌సభ ఎన్నికలలో కలిపి 66.95 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియలో దాదాపు 97 కోట్ల ఓటర్లలో 45.10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఇసి ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న మిగిలిన లోక్‌సభ ఎన్నికల దశలలో ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఇసి పిలుపునిచ్చింది. మే 13న జరిగిన నాలుగవ దశ పోలింగ్‌లో 69.16 ఓటింగ్ శాతం నమోదైనట్లు తాజా గణాంకాలను ఇసి వెల్లడించింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో ఇదే దశతో పోలిస్తే 3.65 శాతం అధిక ఓటింగ్ ఈసారి నమోదైందని తెలిపింది.

మూడవ దశలో 65.68 శాతం పోలింగ్ నమోదైందని, 2019 లోక్‌సభ ఎన్నికల మూడవ దశలో 68.4 శాతం ఓటింగ్ శాతం నమోదైందని ఇసి వెల్లడించింది. ఏప్రిల్ 26న జరిగిన రెండవ దశ ఎన్నికలలో 66.71 శాతం పోలింగ్ నమోదు కాగా 2019 ఎన్నికలలో ఇది 69.64 శాతమని తెలిపింది. ఏప్రిల్ 19న జరిగిన తొలి దశ ఎన్నికలలో 66.14 శాతం ఓటింగ్ నమోదు కాగా గత ఎన్నికల తొలి దశలో 69.43 శాతం పోలింగ్ నమోదైందని ఇసి వివరించింది. మిగిలిన మూడు దశల పోలింగ్‌లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొనేందకు వారిలో చైతన్యం తీసుకురావడంపై దృష్టి సారించినట్లు ఇసి తెలిపింది. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులకు ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఇసి పేర్కొంది. మొదటి నాలుగు దశలలో 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని మొత్తం 379 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News