సీఏఏ అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి వ్యతిరేకంగా విపక్షాల వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందిస్తూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై ధ్వజమెత్తారు. ఈ చట్టంపై ఆయా పార్టీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఉత్తరప్రదేశ్‌తోపాటు దేశమంతటా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని అజంగఢ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ విపక్షాలపై ధ్వజమెత్తారు. “ దేశ విభజన, ఇతర కారణాలతో దేశంలో చాలా ఏళ్లుగా అనేక మంది శరణార్థులు జీవిస్తున్నారు. ఆ బాధితులకు కేంద్రం సీఏఏ ( పౌరసత్వం సవరణ చట్టం) ద్వారా పౌరసత్వం కల్పిస్తోంది. కానీ కాంగ్రెస్, ఎస్పీ ఈ చట్టంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి.
అధికారం సాధిస్తే సీఏఏను రద్దు చేయడానికి ఇండియా కూటమి యోచిస్తోంది. కానీ అది ఎన్నటికీ జరగదు. ఈ చట్టాన్ని తొలగించడం అసాధ్యం. వారంతా మోసగాళ్లు (ప్రతిపక్ష నేతలను ఉద్దేశిస్తూ ) మతోన్మాద మంటల్లో దేశం కాలిపోయేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు” అని మోడీ ప్రతిపక్షాలపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. సీఎఎ చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశం, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరమే భారత పౌరసత్వాన్ని ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనల్ని రూపొందించిన సంగతి తెలిసిందే. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.