ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ రాజ్యసభ ఎంపి స్వాతి మాలివాల్‌ను అనేక సార్లు తన్నారని, చెంపదెబ్బ కొట్టారని, సాయం కోసం ఆమె కేకలు పెట్టినా దాడి ఆపలేదని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. సోమవారం కేజ్రీవాల్ అధికార నివాసంలో మాలివాల్‌పై జరిగిన దౌర్జన్యానికి సంబంధించిన వివరాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. రాజ్యసభ ఎంపి మాలివాల్ ఈ కేసులో తన వాగ్మూలం నమోదు నిమిత్తం మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. ఢిల్లీ పోలీసలు గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కుమార్‌ను కేసులో నిందితునిగా చేర్చినట్లు అధికారులు వెల్లడించారు.
సాయం కోసం మాలివాల్ అదేపనిగా ‘కేకలు పెట్టారు’ అని, కాని కుమార్ ‘ఆగకుండా దాడి చేశారు’ అని, ఆమెను ఛాతీపైన, కడుపుపైన, శరీరంలో దిగువ భాగాలపైన తన్నారని ఎఫ్‌ఐఆర్ తెలిపింది. కుమారు ‘పదే పదే పూర్తి బలంతో’ తనపై దాడి చేశారని, ఏడెనిమిది సార్లు చెంపదెబ్బ కొట్టారని మాలివాల్ తన ఫిర్యాదులో తెలిపారు. మాలివాల్ సోమవారం ఉదయం ఢిల్లీ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ముఖ్యమంత్రి అధికార నివాసంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బంది ఒకరు తనపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు.