Monday, December 23, 2024

రాజస్థాన్ బిజెపి సర్కారులో సంక్షోభం

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సారధ్యపు బిజెపి ప్రభుత్వంలో ఆరు నెలలకే తొలి భారీ సంక్షోభం నెలకొంది. రాష్ట్రంలోని బిజెపి సీనియర్ నేత , రాష్ట్ర వ్యవసాయ మంత్రి కిరోధి లాల్ మీనా శుక్రవారం సొంత పార్టీ ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హౌసింగ్ పథకం పట్ల ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి శర్మకు బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏకంగా రూ 1140 కోట్ల నష్టం వాటిల్లుతుందని, తప్పులతడకల ఈ ప్రాజెక్టును ఎందుకు చేపడుతున్నారని ఈ లేఖలో ఈ సీనియర్ మంత్రి తమ నేత అయిన సిఎంకు రాసిన లేఖలో ప్రశ్నించారు. కేబినెట్ సమిష్టి అనుమతి లేకుండా ఈ ప్రాజెక్టును ఎందుకు అమలు చేస్తున్నారని నిలదీసిన కిరోధి లాల్ , దీనిని వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేశారు. సంబంధిత అనుమతుల ఫైలును వెంటనే వెనకకు తీసుకోవాలని సూచించారు. రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ను బిజెపి మట్టి కరిపించింది.

ఈ క్రమంలో భజన్‌లాల్ శర్మ సిఎంగా ప్రభుత్వం ఏర్పడింది. గాంధీనగర్‌లోని ఓల్డ్ ఎంఆర్‌ఇసి క్యాంపస్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టు వల్ల భారీ నష్టం జరుగుతుందని మంత్రి తెలిపారు. జిఎడి ఈ ప్రాజెక్టు పరిధిలో ఇప్పుడున్న భవనాలను కూలగొట్టడం, ఈ స్థానంలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించడానికి నిర్ణయించింది. ఇక్కడి భూమి విలువ, చదరపు గజం చొప్పున ఉన్న ధరలు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 33 శాతం ఫ్లాట్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతుందనే విషయం మీకు తెలుసా? అని సిఎంను ఈ మంత్రి నిలదీశారు. ఇంతకూ ఈ ప్రాజెక్టుకు మంత్రి మండలి అనుమతి లేదు. వ్యయానికి అయ్యే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి కూడా సమ్మతి లేదని తెలిపారు. వెంటనే ప్రాజెక్టును నిలిపివేసి తీరాలని డిమాండ్ చేశారు.

ఈ ఆరునెలల కాలంలోనే ఈ మంత్రి ఇంతకు ముందు పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును తప్పుపట్టారు. లోక్‌సభ ఎన్నికలు కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో సొంత ప్రభుత్వంపై సీనియర్ మంత్రి విరుచుకుపడటం, ప్రజలందరికి విదితం అయ్యేలా సిఎంకు లేఖ సంధించడంతో దీని పరిణామం రాజకీయంగా తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ బలీయంగానే ఉన్న దశలో బిజెపి ప్రభుత్వంలో తలెత్తిన ఈ పరిణామం పట్ల పార్టీ వర్గాలలో ఆందోళన వ్యక్తం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News