బెంగళూరు నుంచి కొచ్చికి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం శనివారం రాత్రి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజిన్‌లో మంటలు చెలరేగడమే ఇందుకు కారణం. 179 మంది ప్రయాణికులు , ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. బెంగళూరు విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే సిబ్బంది మంటల్ని గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారమిచ్చారు. దీంతో ఎయిర్‌పోర్టులో అత్యవసర ఏర్పాట్లు చేశారు. రాత్రి 11.12 గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండయింది. మంటల్ని చూసిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఎట్టకేలకు రన్‌వేపై క్రాష్ ల్యాండ్ అయిన విమానం నుంచి ప్రయాణికులు ఓపెన్ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చారు. ఈ క్రమంలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. అప్పటికే ఫైరింజన్లు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. విమానం ఆగిన వెంటనే మంటలను ఆర్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా ప్రయాణికులను రన్‌వే నుంచి ఎయిర్‌పోర్టు లోపలికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విచారం వ్యక్తం చేసింది. నియంత్రణా సంస్థలతో కలిసి దర్యాప్తు చేస్తామని తెలిపింది. మంటలు చెలరేగడానికి కారణాలను తెలుసుకుంటామని పేర్కొంది. శుక్రవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిరిండియా విమానం లోనూ ఇదే తరహా సంఘటన జరిగింది. ఏసీలోమంటలు రావడంతో వెంటనే ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండయ్యింది.