దేశంలో వ్యవసాయ సాగుకు, ఏరువాకకు అత్యంత కీలకం , ప్రాణాధారం అయిన నైరుతిరుతుపవనాలు ఆదివారం నికోబార్ దీవులకు చేరాయి. దేశ దక్షిణకొనలో ఉండే దీవులకు పవనాలు చేరాయని, కదలిక సంతృప్తికరంగా ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. కేరళకు నైరుతి రుతుపవనాలు రావడానికి ముందు పలు కీలక ఘట్టాలు ఉంటాయి. ఇందులో నికోబార్‌కు ఇవి చేరుకోవడం కీలక పరిణామం అయింది. రుతుపవనాలు మాల్దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలో కొమోరిన్ ప్రాంతం, ఇతర చోట్లకు విస్తరించుకున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం ఈ దశలోనే ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల భారీ వర్షసూచనలు వెలువడ్డాయి.ప్రతి ఏటా సాధారణంగా రుతుపవనాలు మే 31 లేదా జూన్ 1 లేదా జూన్ 2వ తేదీన కేరళను తాకడం మంచివర్షకాలానికి ప్రతీక అవుతోంది. ఈసారి మే 31వ తేదీన కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండి విశ్లేషించింది. కేరళకు రుతుపవనాల రాక మొత్తం మీద చూస్తే వేర్వేరుగా ఉంటూ వస్తోంది. 1918లోమే 11వ తేదీనే రుతుపవనాలు వచ్చాయి.
ఈ క్రమంలో ఇదే అత్యంత తొందరగా రుతుపవనం చేరుకున్న ఏడాది అయింది. కాగా 1972లో రుతుపవనాలు జూన్ 18న చేరుకోవడం ఆలస్యపు రికార్డు అయింది. గత ఏడాది రుతుపవనాలు జూన్ 8వ తేదీన కేరళకు చేరాయి. అంతకు ముందు ఏడాది మే 29వ తేదీన ఇవి వచ్చాయి. అంతకు ముందటి రెండు ఏడాదులలో వీటి ఆగమనం జూన్ 1, 2వ తేదీల్లో జరిగింది. ఇప్పుడు సకాలంలో రుతుపవనాలు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వాతావరణంలో ఏర్పడ్డ అసాధారణ మార్పులు, ప్రత్యేకించి పెనుగాలులు, భారీ వర్షాలు వంటివి ఎటువంటి ప్రభావానికి దారితీస్తాయనేది విశ్లేషణకు దారితీసే అంశం అయింది. ఈసారి సానుకూల లా నినా పరిస్థితులు ఉన్నాయని, ఈ క్రమంలో సాధారణం కన్నా ఎక్కువగానే వానలు పడుతాయని గత నెలలో ఐఎండి అంచనావేసింది. జూన్ జులైలు వర్షాకాలంలో అత్యంత కీలకమైన నెలలు. ఈ రెండు నెలల్లో పడే వర్షాలు, ప్రత్యేకించి మబ్బులు స్థిరంగా , సాంద్రతలను తేమను సంతరించుకని ఉండటం అనేది కీలక పరిణామం అవుతోంది. దేశంలో అత్యంత కీలకమైన ఖరీఫ్ పంటకాలం ఈ రుతుపవనాల ఆగమనపు జూన్ ఆ తరువాతి జులైలోనే ఎక్కువగా ఆరంభం అవుతుంది.