ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ(66) అర్థశతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో కోహ్లీ రికార్డును బద్దలు కొడుతూ ఐపీఎల్ లో నయా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్ లో అభిషేక్ 41 సిక్సర్లు బాదాడు.దీంతో ఐపీఎల్ ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. 2016లో కోహ్లీ 38 సిక్సర్లు బాది తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. ప్రస్తుత సీజన్ లో కోహ్లీ 37 సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానిక వస్తే.. సొంతగడ్డపై జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ పై సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. కింగ్స్ బ్యాటర్లు నిర్ధేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. అభిషేక్(66)తోపాటు త్రిపాఠి(33), నితీష్ రెడ్డి(37), క్లాసెన్ (42)లు రాణించారు. ఈ గెలుపుతో ఆరంజ్ ఆర్మీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రభసిమ్రాన్ సింగ్(71; 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), అథర్వ తైడే(46), రిలీ రోసో(49), జితేశ్ శర్మ (32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు, కమిన్స్, విజయ్‌కాంత్ వియస్కాంత్ ఒక్కో వికెట్ పడగొట్టారు.