ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిర్ ఆమిర్ అబ్దుల్లాహియాన్‌తోసహా మొత్తం తొమ్మిది మంది ఆదివారం వాయువ్య ఇరాన్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇరాన్-అజర్‌బైజాన్ సరిహద్దుల నుంచి తిరిగివస్తూ వాయువ్య ఇరాన్‌లోని తబ్రీజ్ నగరానికి వెళుతున్న అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన పొగమంచులో చిక్కుకుని ప్రమాదానికి గురైనట్లు ప్రభుత్వ మీడియా ప్రెస్ టివి సోమవారం ప్రకటించింది. హెలిపాక్టర్‌లో అధ్యక్షడు రైసీ వెంట విదేశాంగ మంత్రి హుస్సేన్ ఆమిర్ అబ్దుల్లాహియాన్, తూర్పు అజర్‌బైజాన్ గవర్నర్ మాలెక్ రహ్మతి, తూర్పు అజర్‌బైజాన్ ఇమామ్ ఆఫ్ ఫ్రైడే ప్రేయర్ మొహమ్మద్ అలీ అలే హషీం, మరి కొందరు ఉన్నట్లు వార్తాసంస్థ తెలిపింది. అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి అమరత్వం పొందడంతో ప్రభుత్వ క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైనట్లు ఇర్నా వార్తాసంస్థ తెలిపింది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మరణిస్తే సుప్రీం లీడర్ అనుమతితో తొలి ఉపాధ్యక్షుడు ఆ బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది.
ఈ ప్రకారం చూస్తే ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముఖ్బేర్ అధ్యక్షుడి స్థానంలో బాధ్యతలు చేపట్టవలసి ఉంటుందని సిఎన్‌ఎన్ వార్తాసంస్థ తెలిపింది. ఇదిలా ఉంగా, ప్రమాదం జరిగిన ప్రదేశంలో హెలికాప్టర్ శకలాలను గమనిస్తే ప్రయాణికులు బతికే అవకాశాలు లేవని అల్ జజీరా వార్తాసంస్థ తెలిపింది. హెలికాప్టర్‌కు చెందిన మొత్తం క్యాబిన్ పూర్తిగా దగ్ధమైందని ఆ సంస్థ తెలిపింది. అయితే కొన్ని మృతదేహాలు గుర్తు పట్టలేనంతటా కాలిపోయాయని, ప్రమాద స్థలంలో మృతదేహాలను గుర్తించడం సాధ్యం కాలేదని ఇరాన్ అధికరులు కొందరు తెలిపినట్లు వార్తాసంస్థ పేర్కొంది. ఒక పర్వత ప్రాంతంలోని దట్టమైన అడవిలో హెలికాప్టర్ కూలిపోయినట్లు డ్రోన్ ఫుటేజ్ ద్వారా తెలుస్తోందని సిఎన్‌ఎన్ తెలిపింది. హెలికాప్టర్‌కు చెందిన నీలం, తెలుపు రంగు వెనుకభాగం(టెయిల్) తప్ప ఏమీ మిగల్లేదని వివరించింది. అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశాన్ని సోమవారం తెల్లవారుజామున గుర్తించినట్లు వార్తాసంస్థ తెలిపింది. ఖోయలర్ గ్రామం నుంచి కేలెమ్ వెళ్లే మార్గంలో ఈ ప్రదేశం ఉన్నట్లు తెలిపింది. హెలికాప్టర్ బ్లేడ్లు, రెక్కలు ఒక పర్వతంపై కనిపించాయని, వెంటనే పర్వతంపైకి వెళ్లిన సహాయక బృందాలు హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశాన్ని గుర్తించాయని సిఎన్‌ఎన్ తెలిపింది.
సహాయక బృందాలు పంపిన వీడియోల ప్రకారం అక్కడ పూర్తిగా దగ్ధమైన హెలికాప్టర్ శకలాలు కనిపించాయని, ప్రయాణికుల మృతదేహాలు సైతం కనిపించలేదని ఇరానియన్ రెడ్ క్రీసెండ్ తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం అజర్‌బైజాన్ తిరిగివస్తున్న అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని కూలిపోయినట్లు టస్నీమ్ న్యూస్ తెలిపింది. హెలికాప్టర్‌లో అధ్యక్షుడు రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ ఆమిర్, తూర్పు అజర్‌బైజాన్ గవర్నర్ మాలెక్ రహ్మతి, గబ్రీజ్ ఫ్రైడే ప్రేయర్ ఇమామ్ మొహమ్మద్ అలీ అలీహషెమ్, పైటల్, కోపైలట్, క్రూ చీఫ్, భద్రతాధిపతి, ఒక బాడీగార్డు ఉన్నట్లు ఐఆర్‌జిఎసి నిర్వహించే సెపా మీడియా సంస్థ వెల్లడించింది. మొట్టమొదటిసారి ఇరాన్ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం దేశంలో ఎన్నడూ జరగలేదని అల్ జజీరా తెలిపింది. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అధ్యక్షుడు రైసీ, విదేశాంగ మంత్రి, ఇతర అధికారులు, ప్రయాణికుల మృతదేహాలను తబ్రీజ్ నగరానికి తరలిస్తున్నట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. అక్కడే వారి ఖననం జరుగుతుందని ఇస్లామిక్ రిపబ్లిక్ రెడ్ క్రీసెంట్ సొసైటీ(ఐఆర్‌సిఎస్) అధిపతి హుస్సేన్ కోలివాండ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా అధ్యక్షుడు రైసీ మృతికి ఇరాన్ సుప్రీం లీడర్ అయాలొల్లా ఖమేనీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. తాను, రైసీ ఉన్న ఫోటోను పోస్టు చేసిన ఆయన సంతాప సందేశం రాశారు.
ఆపద్ధర్మ అధ్యక్షుడిగా మొహమ్మద్ మొఖ్బేర్
హెలిపాక్టర్ ప్రమాదంలో మరణించిన అధ్యక్షుడు ఇబ్రహిం రైసీకి సంతాప సూచకంగా ఐదు రోజుల సంతాప దినాలను ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖేమేనీ సోమవారం ప్రకటించారు. అంతేగాక ప్రభుత్వాధిపతిగా తొలి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ మొఖ్బేర్‌కు ఖమేనీ ఆమోదం తెలిపారు. రైసీ వారసుడిని ఎన్నుకునేందుకు 50 రోజులలో అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఐదు రోజుల సంతాపాప దినాలను, ఇరాన్ ప్రజలకు తన సంతాపాన్ని తెలియచేస్తున్నట్లు సుప్రీం నాయకుడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ విభాగాన్ని మొఖ్బేర్ నిర్వహిస్తారని, 50 రోజులలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని శాసన, న్యాయ విభాగాధిపతులను ఆదేశిస్తున్నట్లు ఖమేనీ తెలిపారు. ఇరాన్ రాజ్యాంగంలోని 131 అధికరణ ప్రకారం కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం మార్గాన్ని రూపొందించే బాధ్యత దేశ తొలి ఉపాధ్యక్షుడు, పార్లమెంట్ స్పీకర్, న్యాయ వ్యవస్థ అధిపతిపైన ఉంటుంది. మరణించిన రైసీ తరహాలోనే మొఖ్బేర్ కూడా ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పరిగణిస్తారు. 2021లో రైసీ అధ్యక్షుడిగా ఎన్నిక కాగా తొలి ఉపాధ్యక్షుడిగా మొఖ్బేర్ ఎన్నికయ్యారు.