Friday, December 20, 2024

రామకృష్ణ మిషన్‌పై నేను అలా అనలేదు: మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ, ఇస్కాన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు సమాజంలోని వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వెనక్కు తగ్గారు. బంకుర జిల్లాలోని బిష్ణుపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో సోమవారం ఒక ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తూ తన వ్యాఖ్యలను సమర్ణించుకునే ప్రయత్నం చేశారు. నేనేం చెప్పాను? ఏ సంస్థకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. రామకృష్ణ మిషన్‌కు నేను వ్యతిరేకం కాదు. కొంతమంది వ్యక్తులపైనే నేను మాట్లాడాను. అలాంటి వారిలో కార్తీక్ మహరాజ్ ఒకరు. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్లను ఆయన అనుమతించలేదని నాకు సమాచారం వచ్చింది. మతం ముసుగులో ఆయన బిజెపి తరఫున పనిచేస్తున్నారు. రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనేందుకు ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయి. అయితే అలాంటప్పుడు ఆయన బాహాటంటా కమలం పార్టీలో చేరాలి తప్ప ముసుగేసుకుని కాదు అని ముఖ్యమంత్రి అన్నారు.

తమ సంస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మమతా బెనర్జీకి ముర్షిదాబాద్ జిల్లాలోని బహరంపూర్ విభాగం భారత్ సేవాశ్రమ్ సంఘకు చెందిన సన్యాసి కార్తీక్ మహరాజ్ సోమవారం ఉదయం లీగల్ నోటీసు పంపిన నేపథ్యంలో ఆమె నుంచి ఈ స్పందన కనిపించింది. రామకృష్ణ మిషన్‌తో తనకున్న అనుబంధాన్ని ఆమె వివరించే ప్రయత్నం కూడా చేశారు. రామృకృష్ణ మిషన్‌ను నేను ఎందుకు వ్యతిరేకిస్తాను? కొద్ది రోజుల క్రితం మిషన్‌కు చెందిన ఒక మహరాజ్ అనారోగ్యం చెందితే ఆయనను పరామర్శించడానికి వెళ్లాను. వారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. స్వామి వివేకానంద, శారదా మాత, సిస్టర్ నివేదిత నివాస గృహాలను పునరుద్ధరించాను. అందరూ వారిలాగా ఉండరు అని మాత్రమే నేను చెప్పదలచాను. వేరే రకంగా ఉన్న వారి గురించే నేను మాట్లాడాను అని మమత వివరించారు. రామకృష్ణ మిషన్‌కు చెందిన లక్షలాది మంది శిష్యులలో అన్ని మతాల వారు ఉన్నారన్న వాస్తవాన్ని గ్రహించే మమత ఈ వివరణ ఇచ్చుకోవలసి వచ్చిందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.

రామకృష్ణ మిషన్, శారదా మిషన్ నిర్వహించే విద్యా సంస్థలలో పెద్ద సంఖ్యలో హిందువేతర విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. ఈ విద్యా సంస్థలలో పనిచేసే అధ్యాపకులలో హిందువేతరులు కూడా చాలా మంది ఉన్నారు. స్వామి వివేకానంద స్థాపించిన ఈ సంస్థలకు చెందిన ఆసుపత్రులలో వైద్య నిపుణుల ప్యానల్‌లో ఇతర మతాలకు చెందిన వైద్యులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News