Friday, December 20, 2024

రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినా.. నిరుద్యోగులకు దూరమయ్యాం:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తమ ప్రభుత్వ హయాంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినా నిరుద్యోగులకు దూరమయ్యామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఎ కెటిఆర్ వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు పట్టణంలోని సింగరేణి జెకే కాలనీ క్రీడా మైదానంలో సోమవారం బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన పట్టభద్రులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ…కాంగ్రెస్ పట్టపగలే పట్టభద్రులను మోసం చేస్తోందని మండిపడ్డారు. బ్లాక్‌మెయిలర్, చీటర్ తీన్మార్ మల్లన్నకు ఎంఎల్‌సి అభ్యర్థిగా టికెట్ కేటాయించి కాంగ్రెస్ మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 39 సీట్లు వచ్చినప్పటికీ కేవలం ఎనిమిది శాతం ఓట్లతో స్వల్ప ఓటింగ్ తేడాతో మాత్రమే ఓటమిపాలు అయ్యామని అన్నారు. సుమారు 14, 15 సీట్లను కేవలం కొద్దిపాటి మెజారిటీతో చేజార్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అరచేతిలో వైకుంఠం చూపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదన్నారు.

నిరుద్యోగులు అధికంగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉండదని అన్నారు. అందుకే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ కల్పన కోసం ఏ ప్రభుత్వం అయినా సిన్సియర్‌గా పనిచేస్తుందని అన్నారు. పదేళ్లలో కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో దాదాపు ప్రైవేట్ రంగంలో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రయత్నం కూడా బలంగా చేశామని అన్నారు. పెట్టుబడులు కూడా వెల్లువలా తెచ్చినప్పటికీ..చేసిన గొప్పతనాన్ని కూడా ప్రజలకు సరిగ్గా చెప్పుకోలేక పోయామని అన్నారు. ‘మీ పిల్లలందరికీ రేపటి రోజున వైద్య విద్య అభ్యసించడానికి ఎక్కడికోపోయే అవసరం లేకుండా బ్రహ్మాండంగా మహబూబాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిది’ అని అన్నారు. తెలంగాణలో 65 ఏళ్లలో మొత్తం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు కేవలం మూడైతే.. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కెసిఆర్ నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్న మెడికల్ కాలేజీల సంఖ్య 33 అన్నారు. ఒకవైపు విద్యా వ్యాప్తికి, మరొకవైపు ఉపాధి కల్పనకు, ప్రభుత్వ కొలువులకు,

అన్నిటికీ మించి ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులకి పెద్ద ఎత్తున తమ ప్రయత్నం చేసిందన్నారు. పట్టణాభివృద్ధి ఒకవైపు, మరోవైపు పల్లెల అభివృద్ధి ఇవన్నీ చేసుకుంటూ పదేళ్లపాటు దీక్షతో పనిచేసుకుంటూపోయి తెలంగాణలో ఏ గ్రామానికి, పట్టణానికి, జిల్లా కేంద్రానికి పోయినా తమ హయాంలో చేసిన మార్పు కనబడుతోందని అన్నారు. అదేమాదిరిగా రైతుల విషయానికి వస్తే 2014లో భారతదేశం మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తిలో తెలంగాణ 14వ స్థానం వుంటే కెసిఆర్ నాయకత్వంలో డిసెంబర్ 2023 నాటికి అగ్రస్థానానికి తీసుకువచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే రెండు లక్షల రుణమాఫీపై తక్షణమే సంతకం పెడుతానని కాలయాపన చేస్తున్నారని, ఇచ్చిన 420 హామీలు మరిచిపోయి తమను అడిగేవాళ్ళు ఎవరు ఉంటారులే అనుకుంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే, రెండు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం లోపలనే భర్తీ చేయాలంటే ప్రశ్నించే గొంతుక బిఆర్‌ఎస్ అభ్యర్థిని విద్యావంతులు ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ‘

గోల్డ్ మెడల్ సంపాదించుకున్న నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి మీకోసం అమెరికాలో ఉద్యోగం వదులుకొని ప్రజా జీవితంలోకి వచ్చి విద్యావంతుడుగా మీ ముందున్నాడు’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ఎంఎల్‌ఎసి అభ్యర్థి బ్లాక్ మెయిలర్ అని, 56 కేసులు నమ్ముదైన చీటర్‌ను రంగంలోకి తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు. ‘పట్టభద్రుల ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి అనేది మీ విచక్షణ, విజ్ఞతకు వదిలిపెడుతున్నాం’ అని అన్నారు. ‘ఈ ఎన్నికతో ప్రభుత్వం కూలిపోయేది లేదు.. పడిపోయేది లేదు.. ప్రభుత్వాన్ని రేపటి రోజున మీ తరఫున నిలదీసేవారు అక్కడ ఉంటే మీకు న్యాయం జరగడంతో పాటు రాష్ట్రాన్ని లాభం చేకూరుతుంది’ అని అన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఐపిఎస్ అధికారి, పార్టీ నాగర్‌కర్నూల్ లోక్‌సభ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంఎల్‌ఎలు రేగా కాంతారావు, బానోత్ హరిప్రియ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, మహబూబూబాద్ జడ్‌పి చైర్మన్ బిందు, పార్టీ నాయకుడు లక్కినేని సురేందర్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News