తమిళులను కించపరచడం మానుకోండి!
ఓట్ల కోసం ఇంత నీచానికి ఒడిగడతారా?
చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఒడిశా ఎన్నికల ర్యాలీలో తమిళులను కించపరిచేలా మాట్లాడినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పుపట్టారు. మోడీ ఎన్నికల ప్రచారంలో మాయమైన ఒడిశాలోని జగన్నాధుని కోశాగారం తాళం చెవులు తమిళనాడుకు వెళ్లాయన్నారు. మోడీ కావాలనే తమిళులను కించపరిచేలా ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తూర్పారబట్టారు. ఓట్ల కోసం ప్రధాని ఇంత నీచానికి ఒడిగడతారా? అని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ తమిళులను కించపరిచే విధానం మానుకోవాలని అన్నారు. మోడీ తమిళులపై తప్పుడు కూతలు కూసిన మరునాడే స్టాలిన్ కడిగిపడేశారు. ప్రధాని మోడీ ఒడిశా ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తూ ‘నవీన్ పట్నాయక్ నేతృత్వ ప్రభుత్వంలో పురీలోని జగన్నాథుడు కూడా సురక్షితంగా లేరు, ఆరేళ్లుగా జగన్నాథుని రత్న భండార్(కోశాగారం) తాళం చెవులు కనిపించకుండా పోయాయి’ అన్నారు. రత్న భండార్ తాళం చెవులపై జ్యుడీషియల్ కమిషన్ నివేదికను కూడా ఒడిశా ప్రభుత్వం తొక్కేసిందని మోడీ ఆరోపించారు. జూన్ 10 తర్వాత బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ నివేదికను బహిరంగ పరుస్తామని మోడీ అన్నారు. ఈ సందర్భంగా మోడీ జగన్నాథ స్వామి దేవాలయం కోశాగారం తాళం చెవులు తమిళనాడుకు వెళ్లాయని ఆరోపించారు. దీనిపై స్టాలిన్ ప్రధాని మోడీని ఉతికిపారేశారు. ఒడిశా, తమిళనాడు సంబంధాలను మోడీ దెబ్బతీస్తున్నారని అన్నారు. అంటే మోడీ తమిళులను దొంగలుగా చిత్రీకరించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తమిళులపై మోడీకి అంత కసెందుకని కూడా స్టాలిన్ నిలదీశారు.