ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపగలనని ప్రధాని నరేంద్ర మోడీకి చూపుతానని ఆయన చెప్పారు. శుక్రవారం ఇండియా టుడి టివికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ తాను పదవికి రాజీనామా చేస్తే దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. ఇదే నరేంద్ర మోడీ కూడా కోరుకుటున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించలేనని తెలిసే ఈ పథకానికి మోడీ వ్యూహరచన చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే ప్రభుత్వం పడిపోతుందని, అప్పుడు ఎన్నికలు నిర్వహించి గెలుపొందాలని ప్రధాని భావించారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు తాను రాజీనామా చేస్తే తదుపరి టార్గెట్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అవుతారని ఆయన ఆరోపించారు.
ఢిల్లీ మురికివాడలలో పనిచేసేందుకు ఆదాయం పన్ను శాఖలో మేనేజర్ ఉద్యోగం మానేశానని, గతంలో 49 రోజుల పాటు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని, కాని తన పోరాటంలో భాగంగా ముఖ్యమమంత్రి పదవికి మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తన రాజీనామా కోసం బిజెపి పిల్ కూడా దాఖలు చేసిందని, అయితే సుప్రీంకోర్టు రాజీనామా చేయమని ఆయనపై(కేజ్రీవాల్) ఒత్తిడి చేయలేమని స్పష్టం చేసిందని ఆయన వివరించారు. జైలు నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగితే తనకు జైలులో తనకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్నికల తర్వాత బిజెపి ఓటమి చెందిన రాష్ట్రాలలోని బిజెపియేతర ప్రభుత్వాల ముఖ్యమంత్రులను అరెస్టు చేయడం మోడీ ప్రారంభిస్తారని, అందుకే ఆయన తనఅరెస్టు తర్వాత వెంటనే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్టు చేయడానికి ప్రయత్నించలేదని కేజ్రీవాల్ ఆరోపించారు.