Monday, December 23, 2024

మంత్రి కోమటిరెడ్డి టిమ్స్ ఆసుపత్రులపై విషం చిమ్మడం బాధాకరం : హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషం చిమ్మడం బాధాకరమని బిఆర్‌ఎస్ నేత, మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎల్‌బి నగర్ టిమ్స్ ఆసుపత్రికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. జనాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించాలనే ఆలోచనలతో కెసిఆర్ హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటుకు నాంది పలికారని పేర్కొన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలుగా ఆసుపత్రుల నిర్మాణాలు, పనుల పర్యవేక్షణను గాలికి వదిలేసి, లేని పోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఆసుపత్రులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచన పక్కనపెట్టి రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు.టిమ్స్ ఆసుపత్రుల పట్ల కనీస అవగాహన కూడా లేకుండా ఆర్ అండ్ బి శాఖ మంత్రి మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

టిమ్స్ ఎల్‌బి నగర్ ఆసుపత్రి నిర్మాణం జి+14 అంతస్తులు మాత్రమే అయితే 27 అంతస్తులు అని మాట్లాడడం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎక్కువ అంతస్తులు ఉంటే పేషెంట్లు ఇబ్బంది పడతారని ముసలి కన్నీరు కార్చుతున్న మంత్రికి, ఏప్రిల్ 5, 2022న జైపూర్‌లో నాటి రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిర్మిస్తున్న 24 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సిఎం అరవింద్ కేజ్రీవాల్ డిల్లీలో నిర్మిస్తున్న 22 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. నిజంగా పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, త్వరితగతిన టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురాలని అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచాలి…అంతేగానీ చవకబారు వ్యాఖ్యలు చేసి స్థాయిని మరింత తగ్గించుకోవద్దని హరీశ్‌రావు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News