ఉత్తరాఖండ్ మే 10వ తేదీన చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 50 మందికి పైగా యాత్రికులు మరణించారు. గఢ్వాల్ కమిషనర్ విజయ్ శంకర్ ప్రసాద్ శుక్రవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ పక్షం రోజుల్లో ఇప్పటి వరకు 52 మంది చార్ ధామ్ యాత్రికులు మరణించారని తెలిపారు. వీరిలో చాలా మంది గుండెపోటుతో మరణించారని, వీరిలో అత్యధికులు 60 ఏళ్లు పైబడిన వారేనని ఆయన తెలిపారు. గంగోత్రిలో ముగ్గురు యాత్రికులు, యమునోత్రిలో 12 మంది, బద్రీనాథ్‌లో 14 మంది, కేదార్‌నాథ్‌లో 23 మంది మరణించినట్లు ఆయన చెప్పారు. 50 ఏళ్లు పైబడిన యాత్రికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేసినట్లు ఆయన చెప్పారు.
హిమాలయలోని ఆలయాలకు వెళ్లే మార్గంలో వైద్య పరీక్షలు జరుగుతాయని, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న భక్తులు తమ ప్రయాణాన్ని మానుకోవాలని ఆయన సూచించారు. అయినప్పటికీ తమ యాత్రను కొనసాగించాలని యాత్రికులు భావిస్తే ఒక ఫారాన్ని నింపిన తర్వాత ముందుకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. చార్ ధామ్ యాత్ర కోసం మెరుగైన ఏర్పాట్లు చేసేందుకు నిరతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని వినయ్ శంకర్ తెలిపారు. ఇప్పటి వరకు 9 లక్షల 67 వేల 302 మంది భక్తులు చార్‌ధామ్ సందర్శించారని ఆయన వివరించారు. నాలుగు పుణ్యక్షేత్రాలకు యాత్ర సజావుగా సాగుతోందని ఆయన తెలిపారు.