న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం పెద్ద సమస్యలుగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ గెలుస్తుందని అన్నారు. పరిస్థితులు ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నాయన్నారు. నేటి ఉదయం ప్రియాంక గాంధీ తన ఓటును వినియోగించుకున్నప్పుడు ఈ విషయాలు తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు ఆమ్ ఆద్మీ పార్టీకి, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ వారు కాంగ్రెస్ కు ఓటేయడంపై మాట్లాడుతూ ‘‘ మా మధ్య భేదాలను మేము పక్కకు పెట్టేశాం. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఒకొరికొకరం సహకరిస్తూ ఓటేకుంటున్నాం. అందుకు నేను గర్విస్తున్నాను’’ అన్నారు.
‘‘ బిజెపి నాయకులు ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య తప్ప అన్ని విషయాలపై మాట్లాడుతున్నారు. దీనికి ప్రజలు విసిగిపోయారు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ప్రియాంక గాంధీతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కూతురు మిరయా వాద్రా, కుమారుడు రైహాన్ వాద్రా కూడా తమ ఓటు వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు వినియోగించుకుంటున్న మిరయా వాద్రా ‘‘ప్రజలు ముందుకొచ్చి ఓటేయాలన్నది నా సందేశం’’ అన్నారు.