Thursday, December 19, 2024

ఇదెలా సాధ్యం?

- Advertisement -
- Advertisement -

రూ.200కోట్ల ధాన్యం కొనుగోళ్లు జరిగితే రూ.2వేల కోట్ల అవినీతా?

విపక్షాలవి బాధ్యతారహితమైన
ఆరోపణలు ధాన్యం కొనుగోళ్లలో
రైతులకు న్యాయం చేస్తున్నాం
మిల్లర్లపై నిబంధనల ప్రకారమే
నడుచుకుంటున్నాం సన్న
బియ్యం గింజ కూడా కొనలేదు
టెండర్ పెట్టి రద్దు చేశాం..
రూపాయి కూడా ఖర్చు చేయలేదు
బిజెఎల్‌పి నేత మహేశ్వర్‌రెడ్డి
ల్యాండ్ సెటిల్‌మెంట్ కోసమే
సిఎంను కలిశారు తాలు, తరుగు
విషయంలో అవకతవకలు జరిగితే
కఠిన చర్యలు కేంద్రీయ
బండారును బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది..
తీసేసింది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే
పదేళ్లలో సివిల్ సప్ల్లైయ్స్ శాఖను
ఆగం చేశారు : మంత్రి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫైర్

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.200 కోట్ల ధాన్యం కొనుగోళ్లు జరిగితే రూ.2 వేల కోట్ల అవినీతి ఎలా సాధ్యమవుతుందని పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు న్యాయం చేస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ తాలు, తరుగు విషయంలో అవినీతి చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మిల్లర్లపై రూల్స్ ప్రకారం నడుచుకుంటున్నాం…

1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు చెబుతున్నారన్నారు. ఒక్క గింజ సన్న బియ్యం కూడా కొనలేదని ప్రతిపక్షాలు అంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. రూ.42లకు కిలో సన్నబియ్యం ఇస్తే ప్రభుత్వం ఎంతైనా కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సన్నబియ్యంపై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, సన్నబియ్యంపై టెండర్ పెట్టి రద్దు చేశామని ఆయన వివరించారు. మిల్లర్లపై రూల్స్ ప్రకారం పోయే ప్రభుత్వం తమదని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం మంచిది కాదు

తనపై బాధ్యతారహితమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో క్వింటాల్ ధాన్యం ధర రూ.1700ల వచ్చిందని, తమ ప్రభుత్వంలో క్వింటాల్ ధాన్యం ధర రూ.2007లు పలికిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రూ.1,100 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. కేంద్రీయ బండారును బ్లాక్ లిస్టులో పెట్టింది, తీసేసింది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన దుయ్యబట్టారు. అందుకే ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారం రాష్ట్రానికి మంచిది కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

సిఎం దగ్గరకు ల్యాండ్ సెటిల్‌మెంట్ కోసం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

తాను రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూల్ చేస్తున్నానంటూ బిజెపి ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వినతిపత్రాలు తీసుకొచ్చి సిఎం దగ్గరికి పోయి లోపలికి వెళ్లాక ల్యాండ్ సెటిల్‌మెంట్ విషయాలను మహేశ్వర్ రెడ్డి మాట్లాడుకున్నారని మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బిజెపి ఫ్లోర్ లీడర్ పదవి కోసం మహేశ్వర్ రెడ్డి ఢిల్లీకి డబ్బులు పంపారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. తాను వెయ్యి కోట్లు వసూలు చేశానని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారని, కానీ, తాను ఎవరి దగ్గర నయా పైసా కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికైనా ఇలాంటి నీచపు మాటలు మానుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి డబ్బులు పంపించే సంస్కృతీ బిజెపికి ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తడిసిన ధాన్యాన్ని మద్ధతు ధరకే….

బిఆర్‌ఎస్, బిజెపి మాటల్లో నిజం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ సప్లై శాఖలో వందల కోట్ల అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణల్లో నయా పైసా నిజం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో సివిల్ సప్లయ్ శాఖను బిఆర్‌ఎస్ ఆగం పట్టించిందన్నారు. ధాన్యం కొన్న మూడు, నాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేశామని ఆయన చెప్పారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేశామని తెలిపారు.

నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోను

తాను ఉత్తమ్‌కుమార్ రెడ్డినని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే అస్సలు ఊరుకోనని ఆయన హెచ్చ రించారు. పౌరసరఫరాల శాఖను గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని, రూ.11 వేల కోట్ల అప్పుల్లో ముంచిందని ఆయన ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం కన్నా తాము వేగంగా ధాన్యం కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో అవినీతి లేదని, రైతులకు మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రైస్ మిల్లర్ల విషయంలో రూల్స్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌పై గత ప్రభుత్వం రూ.59 వేల కోట్లు

సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌పై గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.59వేల కోట్లు అప్పు చేసిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. మేం వచ్చే నాటికి సివిల్ సప్లయ్ శాఖను రూ.11వేల కోట్ల అప్పుల్లో ముంచిందని ఆయన విమర్శించారు. రూ.20 వేల కోట్ల ధాన్యాన్ని గాలికి వదిలేసి పోయారని ఆయన మండిపడ్డారు. ఒక్క గింజ సన్నబియ్యం కొనకుండా స్కాం ఎలా చేశామని ఆయన నిలదీశారు. డిఫాల్టర్ అయిన మిల్లులకు ప్రభుత్వం ధాన్యం ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ పాలనలో నడిచినట్లే ఇప్పుడు నడవాలంటే కుదరదన్నారు. బిఆర్‌ఎస్, బిజెపి చుట్టూ డిఫాల్టర్ మిల్లర్లు చేరి ఈ ఆరోపణలు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కరెంట్ పోయిందంటూ కెసిఆర్ దుష్ప్రచారం: మంత్రి శ్రీధర్ బాబు

బిఆర్‌ఎస్ ప్రభుత్వం, కెసిఆర్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. కెసిఆర్ జనరేటర్‌లతో సభలు పెట్టి కరెంట్ పోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంజీఎంలో కరెంట్ పోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రికార్డు స్థాయిలో వినియోగం పెరిగినా విద్యుత్‌ను సరఫరా చేశామన్నారు. బిఆర్‌ఎస్ పాలనలోనే ఎంజీఎంలో ఎలుకలు షేషంట్లను కాళ్లు కొరికిన విషయం మరిచిపోయారా అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. పరిపాలనను గాడిన పెట్టే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన పొరపాట్లు తాము చేయకుండా ముందుకెళ్తున్నామన్నారు. మేడిగడ్డపై విపక్షాలను కూడా సలహాలు ఇవ్వాలని కోరామన్నారు.

బిజెపిలోకి వెళ్లగానే మహేశ్వర రెడ్డికి ఇంత బుద్ది వచ్చిందా?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డికి బిజెపిలోకి వెళ్లగానే ఇంత బుద్ది వచ్చిందా? వాళ్ల తప్పులు ఒప్పులుగా మారాయా? అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. లీడర్ కావాలని కోరికతో నిజాలను దాస్తావా మహేశ్వర రెడ్డి?, ఏదైనా మాట్లాడుతా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. పేపర్‌లో పేరు వస్తే చాలు అని మహేశ్వర రెడ్డి అనుకుంటున్నారని, ఎక్కువ మాట్లాడితే పెద్ద లీడర్ అవ్వరని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలు మాట్లాడితే పెద్ద లీడర్ కాలేవని ఆయన తెలిపారు. తడిచిన ధాన్యాన్ని కొన్న ప్రభుత్వం ఏదైనా ఉందా? సివిల్ సప్లయ్ డిపార్ట్‌మెంట్ ఇంత అప్పుల్లోకి పోవడానికి కేంద్రం కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ధాన్యం ఏవరేజ్ ధర రూ.1700లు మాత్రమేనని, ఇప్పుడు మిల్లర్లు చేస్తున్న తప్పుకు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా? మిల్లర్ల విషయంలో ఇప్పటికే చాలా మార్పులు తెచ్చాం, ఐదు సంవత్సరాల్లో కెసిఆర్ రుణమాఫీ చేయలేదు. తాము ఐదు నెలల్లో చేయబోతున్నాం, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News