12 మంది దుర్మరణం
శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
రేమల్ తుపాను పర్యవసానం
ఐజాల్ : రేమల్ తుపాను ప్రభావంతో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంల మిజోరామ్ ఐజాల్ జిల్లాలోమంగళవారం ఉదయం ఒక స్టోన్ క్వారీ కూలిపోగా 12 మంది దుర్మరణం చెందినట్లు, అనేక మంది అదృశ్యమయ్యారని అధికారులు తెలియజేశారు. ఐజాల్ పట్టణం దక్షిణ శివార్లలోని మెల్థుమ్, హిలిమెన్ మధ్య ప్రాంతంలో మంగళవారం ఉదయం సుమారు 6 గంటలకు ఈ దుర్ఘటన సంభవించిందని వారు తెలిపారు. ‘ఇంత వరకు 12 మృతదేహాలు వెలికితీశారు. ఇంకా అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నాం’ అని ఐజాల్ డిప్యూటీ కమిషనర్ నజుక్ కుమార్ తెలియజేశారు.
‘మరిన్ని మృతదేహాల కోసం చూస్తున్నాం. అక్కడ మొత్తంశిథిలాల తొలగింపు జరిగేంత వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి’ అని ఆమె తెలిపారు. విపత్తు ప్రదేశంలో రక్షణ, సహాయ కార్యక్రమాల నిర్వహణకు భారీ వర్షాలు అంతరాయం కలిగిస్తున్నాయని పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) అనిల్ శుక్లా వెల్లడించారు. వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు ఇతర ప్రదేశాల్లో కూడా కొండచరియలు విరిగపడ్డాయని, కనీసం ఇద్దరు వ్యక్తులు ‘కొట్టుకుపోయారు’ అని ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా, హుంథార్ వద్ద ఆరవ నంబర్ జాతీయ రహదారిపై కొండచరియ విరిగిపడడం వల్ల రాష్ట్ర రాజధానికి దేశంలోని తక్కిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు.