మనతెలంగాణ/హైదరాబాద్ : పౌరసరఫరాల శాఖ కుంభకోణాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాలు మాట్లాడలేదని, ఆయన దాటవేసే ధోరణిలో ఉన్నారని బిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. సివిల్ సప్లైస్ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించలేదని అడిగారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సన్న బియ్యం టెండర్లను ఎల్‌జి సంస్థ దక్కించుకున్నట్లు సివిల్ సప్లైస్ ఎండీ ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. టెండర్‌దారులు వసూలు చేసిన డబ్బును విశాఖపట్నం బ్యాంకుల్లో దాస్తున్నారని, దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు వున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ టూ వైజాగ్ టూ ఢీల్లి డబ్బును పంపిస్తున్నారని అన్నారు. టెండర్ల ధర కంటే అదనంగా మిల్లర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సివిల్ సప్లైస్ అవినీతిపై సిఎం రేవంత్ రెడ్డి,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు మెదపడం లేదని పేర్కొన్నారు. సివిల్ సప్లైస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. సివిల్ సప్లైస్‌కు బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డి కేరళ,ఢిల్లీకి వెళ్తారు,డిప్యూటీ సిఎం పంజాబ్‌లో ఉన్నారు..ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.
సగం క్యాబినెట్ రాష్ట్రంలో లేదని విమర్శించారు. రైతులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు లాఠీఛార్జ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విత్తనాల సరఫరాపై ప్రభుత్వానికి అవగాహన లేదని అన్నారు. ఆదిలాబాద్‌లో రైతులపై లాఠీ ఛార్జ్‌ను ఈ సందర్బంగా ఆయన తీవ్రంగా ఖండించారు.