తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టనున్న ధ్యానాన్ని టివిలలో ప్రసారం చేస్తే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. అది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఆమె తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగింపును పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ కన్యాకుమారిలో స్వామి వివేకానంద స్మారకార్థం నిర్మించిన వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద గురువారం సాయంత్రం నుంచి 45 గంటలపాటు ధ్యానం చేయనున్నారు. ఆయన ధ్యానం చేసుకోవచ్చని, కాని దాన్ని టివిలలో ప్రసారం చేస్తే ఇసికి ఫిర్యాదు చేస్తామని మమత తెలిపారు. ధ్యానం చేస్తుంటే ఎవరైనా కెమెరాలు తీసుకువెళతారా అని ఆమె ప్రశ్నించారు. పోలింగ్ రోజుకు, ప్రచారం ముగింపునకు మధ్య విరామ సమయంలో ప్రచారం చేసేందుకు ఇదో మార్గమని ఆమె ఆరోపించారు. ప్రతి ఎన్నికల చివరి దశ పోలింగ్‌కు ముందు 48 గంటల పాటు మోడీ ధ్యానం చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
ఈసారి బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే ఏ రాజకీయ పార్టీ, ఎన్నికలు, స్వేచ్ఛ, మతం, మానవత్వం, సంస్కృతి ఏవీ మిగలవని ఆమె ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బిజెపి అత్యుత్తమ ఫలితాలను సాధింస్తుందన్న బిజెపి నాయకుల ప్రకటనలను ఆమె తిరస్కరించారు. వారికి బెంగాల్‌లో రసగుల్లా(సున్నా) దక్కతుందని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు టిఎంసి మద్దతు ఇస్తుందని మమత వెల్లడించారు. బెంగాల్‌లో సిపిఎం లేదా కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అది బిజెపికి లాభిస్తుందని ఆమె తెలిపారు. తాను కాంగ్రెస్‌ను బయటపడి తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించకుండా ఉండి ఉంటే ఇప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో సిపిఎంను ఓడించి ఉండేవారం కాదని ఆమె వ్యాఖ్యానించారు. బెంగాల్ నుంచి సిపిఎంను గద్దె దించేందుకు 34 ఏళ్లు పోరాడామని, దాన్ని సాధించగలిగిన తాము బిజెపిని కూడా ఓడించగలమని మమత ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో సిపిఎం, బిజెపి కొన్ని నియోజకవర్గాలలో రహస్య ఒప్పందాన్ని చేసుకున్నాయని ఆమె ఆరోపించారు. బెంగాల్‌లోని 9 లోక్‌సభ స్థానాలకు ఏడవ దశలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనున్నది.