అమరావతి: లోక్ సభ, పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. గెజిటెడ్ సంతకం సడలింపుపై వచ్చిన ఫిర్యాదుపై తాము స్పష్టత ఇచ్చామన్నారు. మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సిఇఒ పరిశీలించారు. అనుమానాలు నివృత్తి చేసేందుకు ఇసి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని, ఫలితాల తరువాత విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని సూచించారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కౌంటింగ్ కేంద్రం వద్ద సిఆర్‌పిఎఫ్ బలగాలతో భద్రత ఉంటుందని చెప్పారు. 175 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులలో 111 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం రెండు గంటలకే పూర్తి చేస్తామని, 61 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు, మిగితా నియోజకవర్గాల్లో రాత్రి తొమ్మిది గంటల లోపు పూర్తిగా ఫలితాలు ప్రకటిస్తామన్నారు. 111 నియోజకవర్గాలకు 20 రౌండ్లు, 61 నియోజకవర్గాలకు 21 నుంచి 24 రౌండ్లు, మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైగా ఉంటుందని ముఖేశ్ వివరించారు.