అగ్నివీర్ పథకం ద్వారా సైనికులను కార్మికులుగా ప్రధాని నరేంద్ర మోడీ మార్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పూరీ జగన్నాథ స్వామివారే మోడీ భక్తుడంటూ ఒడిశౠకు చెందిన బిజెపి నాయకుడు ఒకరు ఇటీల వ్యాఖ్యానించి ఒఇశా ప్రజలను అవమానించారని ఆయన తెలిపారు. భద్రక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సిమూలియాలో గురువారం ఏడవ, చివరి దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగింపు రోజున ఒక ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగిస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఇండియా కూటమి కాపాడుతుందని ప్రకటించారు. ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆహారధాన్యాలపై కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తుందని, రైతుల రుణాలను మాఫీ చేస్తుందని, అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తుందని ప్రకటించారు. అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తాము. ప్రధాని నరేంద్ర మోడీ జవాన్లను కార్మికులుగా మార్చారు. మేము జవాన్లను మళ్లీ సైనికులుగా మారుస్తాము.
జవాన్లందరికీ పెన్షన్ లభిస్తుంది. క్యాంటీన్ సౌకర్యంతోపాటు విధి నిర్వహణలో మరణిస్తే అమర జవాన్లుగా గౌరవం కూడా లభిస్తుంది అని రాహుల్ ప్రకటించారు. ఒడిశాలోని అధికార బిజూ జనతా దళ్ కేంద్రంలోని బిజెపితో కుమ్మక్కు రాజకీయాలు సాగిస్తోందని ఆయన ఆరోపించారు. తాను బిజెపితో పోరాడుతున్నానని, అందుకే తనపై 24 పరువునష్టం కేసులు నమోదు చేశారని ఆయన తెలిపారు. ఇడి తనను 50 గంటలపాటు ప్రశ్నించిందని, తన లోక్‌సభ సభ్యత్వాన్ని బిజెపి లాక్కుందని, తన అధికారిక నివాసాన్ని కూడా స్వాధీనం చేసుకుందని రాహుల్ ఆరోపించారు. ఒకవేళ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బిజెపితో పోరాడుతుంటే ఆయనపై ఒక్క కేసు కూడా ఎందుకు లేదని రాహుల్ ప్రశ్నించారు. బిజెపి, బిజెడి కోటీశ్వరుల కోసమే పనిచేస్తున్నాయి తప్ప పేద ప్రజల కోసం కాదని ఆయన తెలిపారు. ఇక్కడ పట్నాక్ సన్పిహిత అనుచరుడు వికె పాండ్యన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారే తప్ప ముఖ్యమంత్రి కాదని ఆయన ఆరోపించారు. ఒడిశా సంపదను బిజెడి, బిజెపి లూటీ చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు.
తెలంగాణలో బిఆర్‌ఎస్, బిజెపి కుమ్మక్కు అయ్యాయి. ఆ రెండు పార్టీలపై కాంగ్రెస్ పోరాడి వాటి వెన్ను విరిచింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోంది. పేద ప్రజల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను సమకూరుస్తున్నాము. రాష్ట్రంలో మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఒడిశాలో కూడా ఆ పథకాలను అమలు చేస్తాము. బిజెడి-బిజెపి భాగస్వామ్యాన్ని అంతం చేస్తాము అని రాహుల్ ప్రకటించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కోటీశ్వరులకు చెందిన రూ. 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని, కాని కాంగ్రెస్ రైతుల రుణాలను మాఫీ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి యోజన, రైతులు, యువత, ఇతరులకు సంబంధించి అనేక పథకాలను అమలు చేస్తామని ఆయన తెలిపారు. రైతుల పంటలకు ఎంఎస్‌పిపై చట్టబద్ధత కల్పిస్తామని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకం కూలీలకు దినసరి వేతన్నా రూ. 250 నుంచి రూ. 400కు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు.