ముస్లిం వ్యక్తి, హిందు మహిళ మధ్య వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం (ఎస్‌ఎంఎ) కింద రిజిస్టర్ చేసినప్పటికీ ముస్లిం పర్సనల్ లా కింద చెల్లుబాటు కాదని మధ్య ప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. అదే సమయంలో మతాంతర జంటకు పోలీస్ రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. పోలీస్ రక్షణ కోరుతూ ఆ జంట దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జిఎస్ అహ్లువాలియా విచారిస్తూ, ‘విగ్రహారాధకురాలి’తో ముస్లిం వ్యక్తి వివాహాన్ని ముస్లిం చట్టం అనుమతించదని స్పష్టం చేశారు. వధూవరుల మతవిశ్వాసం లేదా మతం ఏదైనప్పటికీ వివాహాలను అనుమతించే ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకోవాలని తాము అభిలషించినట్లు, కాని తమ కుటుంబం నుంచి బెదరింపుల కారణంగా అలా చేయలేకపోయినట్లు సఫీ ఖాన్, సారికా సేన్ కోర్టుకు తెలిపారు.
పెళ్లిళ్ల రిజిస్ట్రార్ ముందు సురక్షితంగా హాజరయ్యేందుకు భద్రత కల్పించాలని, తమ కుటుంబాలు దాఖలు చేసే ఎటువంటి నేరపూరిత అభియోగాల (కిడ్నాపింగ్ వంటి) నుంచి రక్షణ కావాలని వారు అభ్యర్థించారు. తాము మతం మారబోవడం లేదని, ప్రత్యేక వివాహ చట్టం కింద తమ వివాహం పర్సనల్ లా కింద ఆంక్షలకు అతీతమని కూడా ఆ జంట స్పష్టం చేసింది. సారిక హిందువుగా, సఫీ ముస్లింగా కొనసాగుతారని, పరస్పర మత పద్ధతులలో జోక్యం చేసుకోరని వారు తెలిపారు. వారి పిటిషన్‌ను వ్యతిరేకించిన మహిళ కుటుంబం ఆమె కుటుంబ నగలు, నగదుతో పారిపోయిందని, మతాంతర వివాహం తమ సామాజిక వెలివేతకు దారి తీస్తుందని వాదించింది. కోర్టు ఉభయ పక్షాల వాదనలు విని, సంబంధిత ఆచారాలను పరిశీలించిన తరువాత ముస్లిం వ్యక్తి, విగ్రహారాధన మహిళ మధ్య వివాహాన్ని సరైనది కాదని పరిగణిస్తున్నట్లు తెలియజేసింది. జంటకు పోలీస్ రక్షణ లేదా ఇతర వెసులుబాట్ల మంజూరుకు కారణాలు లేవని కోర్టు పేర్కొంటూ వారి పిటిషన్‌ను కొట్టివేసింది.