Friday, November 22, 2024

మహోగ్ర భానుడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాదిన తీవ్రమైన వడగాలులు పరిస్థితులు కొనసాగుతుండగా ఇంత వరకు కనీసం 58మంది వ్యక్తు లు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ, పం జాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి తీవ్ర బాధిత ప్రదేశాల్లో గత కొన్ని రోజుల్లో 45 డిగ్రీలకు పైగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఒడిశా సుందర్‌గఢ్ జిల్లాలో వడదెబ్బ అనుమానంతో 12మంది మరణించారు. పిటిఐ వార్తాసంస్థ సమాచారం ప్రకారం, ఝార్ఖండ్ పాలము జిల్లాలో వడదెబ్బ లక్షణాలతో ఒక మహిళతో సహా నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆ జిల్లాలో గురువారం రాష్ట్రంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రత 47.4 డిగ్రీలు నమోదు జరిగింది. బీహార్‌లో వడదెబ్బ వల్ల గురువారం ఎనిమిది మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎండదెబ్బకు ఆరుగురు హోంగార్డులు మృత్యువాత పడ్డారు. ఎన్నికల విధుల్లో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వీరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రికార్డు స్థాయిలో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది పూర్వపు రికార్డులను అధిగమించింది. నాగ్‌పూర్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (ఎడబ్లుఎస్) ఇది వరకు ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేస్తున్నాయి. సరిగ్గా ఒక రోజు వాయవ్య ఢిల్లీలోని ముంగేశ్వర్ ఎడబ్లుఎస్ నమోదు గణాంకాలను ఇది దాటింది. ముంగేశ్వర్ 52.9 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదు చేసిన విషయం విదితమే. సోనెగాఁవ్‌లో ప్రాంతీయ వాతావరణ కేంద్రంలోని ఎడబ్ల్యుఎస్ 54 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదు చేసింది.

ఢిల్లీలో నీటి సంక్షోభం, విద్యుత్ కోతలు
ఇది ఇలా ఉండగా, దేశ రాజధానిలో నీటి సమస్య విషయమై ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుత హీట్‌వేవ్ పరిస్థితుల కారణంగా నగరంలో నీటి డిమాండ్ బాగా పెరిగిందని, ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఒక నెల పాటు అదనపు నీటిని విడుదల చేయవలసిందిగా పొరుగున ఉన్న హర్యానాను తాము అర్థిస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం ఒక అర్జీలో సుప్రీం కోర్టుకు తెలియజేసింది. దుర్భరమైన ఈ ఎండ వేడిమి ఉత్తరాదిన విద్యుత్ కోతలకూ దారి తీసింది. దీనితో ప్రజల ఇక్కట్లు రెట్టింపు అయ్యాయి.
నేటి నుంచి హీట్‌వేవ్ తగ్గవచ్చు
ఇది ఇలా ఉండగా, హీట్‌వేవ్ పరిస్థితులు శనివారం నుంచి తగ్గే అవకాశం ఉందని ఐఎండి సూచించింది. ‘గడచిన 24 గంటల్లో బీహార్, ఝార్ఖండ్, ఒడిశాలో అనేక మంది మరణించారు. శనివారం నుంచి ఈ మొత్తం ప్రాంతం నుంచి హీట్‌వేవ్ పరిస్థితులు క్రమేపీ తగ్గవచ్చునని మేము ఆశిస్తున్నాం. దీని ఆధారంగా, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఒడిశా, బీహార్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌కు సంబంధించి మేము శుక్రవారం ఆరంజ్ అలర్ట్ జారీ చేశాం’ అని ఐఎండి సైంటిస్ట్ సోమా సేన్ తెలియజేశారు. కాగా, ఊహించిన తేదీ కన్నా రెండు రోజుల ముందుగానే గురువారం కేరళలోను, ఈశాన్య రాష్ట్రాల్లోను నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా, అవి ఒక నెల తరువాతే ఉత్తర, మధ్య, తూర్పు భారత ప్రాంతాలకు చేరతాయి.

నాగ్‌పూర్‌లో ఉష్ణోగ్రత 56 డిగ్రీలు చేరలేదు: ఐఎండి
నాగ్‌పూర్‌లోని వాతావరణ కేంద్రం గురువారం 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు చేసిందన్న వార్తల నేపథ్యంలో ఉష్ణోగ్రత సెన్సార్లు సరిగ్గా పని చేయని కారణంగా ఆ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ సిబ్బంది స్పష్టం చేశారు. నాగ్‌పూర్‌లోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (ఎడబ్లుఎస్) తీరుపై ఇప్పుడు పరిశీలన జరగనున్నది. వార్తల ప్రకారం, నాగ్‌పూర్ రామ్‌దాస్‌పేఠ్‌లోని పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ కృషి విద్యాలయ్ (పిడికెవి)కి చెందిన 24 హెక్టార్ల ఓపెన్ వ్యవసాయ క్షేతం 56 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదు చేసింది. అయితే, న్యూఢిల్లీ కేంద్రంగా గల భారత వాతావరణ శాఖ (ఐఎండి), నాగ్‌పూర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్‌ఎంసి) శుక్రవారం ఒక వివరణ వెలువరించాయి. ‘నాగ్‌పూర్ నగర ఎడబ్లుఎస్‌లోని ఉష్ణోగ్రత సెన్సర్ ప్రస్తుతం సరిగ్గా పని చేయడం లేదు. నాగ్‌పూర్ ఆర్‌ఎంసి దానిని సరి చేసే పనిలో ఉంది. అయితే, తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ సెన్సర్లు విఫలం కావచ్చునని గుర్తించడం ముఖ్యం. గురువారం నాటి 56 డిగ్రీల ఉష్ణోగ్రత వార్త సరైనది కాదు. అధికారికంగా ప్రకటించినది కాదు’ అని నాగ్‌పూర్ ఆర్‌ఎంసి వివరించింది. అయితే, సమీపంలో కేంద్ర పత్తి పరిశోధన సంస్థ (సిఐసిఆర్)లో పని చేస్తున్న ఎడబ్లుఎస్ నమోదు చేసిన గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీలని నాగ్‌పూర్ ఆర్‌ఎంసి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News