రాష్ట్రంలో ధాన్యం దందాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుండడంతో బెంబేలెత్తుతున్న అక్రమ మిల్లర్లకు మిల్లర్ల డాన్ కొత్తరాగం వినిపిస్తున్నారు. అక్రమాల నుంచి తాను ఎవరినైనా తప్పిస్తానని, తన చేతిలో ఇద్ద రు మంత్రులు ఉన్నారని, వారి పేర్లను కూడా డాన్ అక్రమ మిల్లర్లకు చెబుతున్నాడు. మంత్రులే కాకుండా పౌర సరఫరాల శాఖలో కీలక అధికారి కూడా తన జేబులో ఉన్నాడని, ఎవరూ కంగారు పడవద్దని అందరినీ రక్షిస్తానని డాన్ హామీ ఇస్తున్నట్లు తెలిసింది. జిల్లా స్థాయిలోని పౌర సరఫరాల శాఖల అధికారులు కూ డా తాను చెప్పిందే వేదంగా వింటారని, ఇప్పుడు కూడా తాను మంత్రుల అండతో అక్రమ వ్యాపారాన్ని కొనసాగేలా చూస్తానని డాన్ కమ్ మోనార్క్ చెబుతున్నట్లు మిల్లర్ల వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రం లో సిఎంఆర్ ధాన్యంతో వందలాది మంది మిల్లర్లు వేలాది కోట్లు ఎగవేసినా ఇప్పటికీ చర్యలు లేవంటే అది తన ప్రభావమేనని ఆయన చెప్తున్నారు. ఉదాహరణగా సూర్యాపేటలో 16 మంది అక్రమ మిల్లర్లు డిఫాల్టర్లుగా తేలితే ఒక్క మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి రామనర్సయ్య మాత్రమే అరెస్టు అయ్యారని అది కూడా తన ప్రభావమేనని చెబుతున్నారు.
అక్కడి అధికారులు మిగతా అక్ర మ మిల్లర్లపై చర్యలు తీసుకోకపోవడాని కి తన హవానే కారణమని చెబుతూ మిల్లర్లపై సడలుతున్న పట్టును కొనసాగించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలోని ఇద్దరు మంత్రుల పేర్లను దుర్వినియోగం చేస్తూ మిల్లర్లను మభ్యపెడుతూ తన ప్రాబల్యం కొనసాగేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల వివాదాస్పదమైన 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ టెండర్లు రద్దు కాకపోవడానికి కూడా తానే కారణమని తాను తనకు సన్నిహితంగా ఉన్న మంత్రి చెప్పడం వల్లనే టెండర్లపై పౌర సరఫరాల శాఖ ఇప్పటి దాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని డాన్ మిల్లర్లను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాల వారీగా తాను ఏర్పరచుకున్న ముఠాతో గడిచిన మూడు రోజులుగా మంత్రుల పేరు చెబుతూ మిల్లర్లు ఎప్పటి మాదిరిగానే సిఎంఆర్ ధాన్యం పెట్టకున్నా ఏమీ కాదనే భరోసా ఇస్తున్నారు. దీనికి తగినట్టుగా ప్రభుత్వంలో టెండర్లపై నిర్ణయం తీసుకోకపోవడంతో మిల్లర్లు కూడా ఆ డాన్‌ను విశ్వసిస్తున్నారు. అయితే ప్రభుత్వం మొత్తం మిల్లర్ల దందా వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే విషయమై రహస్యంగా విచారణ జరుపుతున్నది.
గత ప్రభుత్వ హయాంలో ఈ డాన్ కుమ్మక్కుతో ప్రజా ప్రతినిధులు ఎవరెవరు సిఎంఆర్ ధాన్యాన్ని ఎగ్గొట్టారో తెలుసుకొని వారిపై చర్యలు తీసుకునే ఆపరేషన్‌ను ప్రారంభించింది. నిజామాబాద్ జిల్లాలో గతంలో వివాదాస్పదమైన ఓ మాజీ ప్రజాప్రతినిధి అండదండలతోనే అధికారులు అడ్డంగా సిఎంఆర్ ధాన్యాన్ని అప్పగించడం ఇప్పటి వరకు ఆ ధాన్యం సర్కారుకు చేరకపోవడంతో దానికి కారణమైన ఇద్దరు అధికారులను పౌర సరఫరాల శాఖ సస్పెండ్ చేసింది. దీనితో ఈ డాన్ నిర్వాకంతో ఇంత కాలం తమకేమీ కాదనే ధీమాతో అడ్డగోలుగా సిఎంఆర్ ధాన్యాన్ని అక్రమ మిల్లర్లకు అంటగట్టిన అధికారులు మిగతా జిల్లాల్లో కూడా హడలెత్తిపోతున్నారు. సిఎంఆర్, రేషన్ బియ్యం రీసైక్లింగ్‌తో మిల్లింగ్ వ్యాపారం కోట్ల లాభాలను ఆర్జించడంతో గతంలో అనేక జిల్లాల్లో మాజీ ప్రజా ప్రతినిధులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మిల్లర్లతో లాలూచీ అయ్యారు. కొందరు మిల్లుల్లో స్లీపింగ్ పార్టునర్లుగా పెట్టుబడులు పెట్టారు. మరి కొందరు మిల్లర్ల నుంచి ఎన్నికల ముందు భారీగా ఎన్నికల ఫండ్ తీసుకుని సిఎంఆర్ ధాన్యం ప్రభుత్వానికి రాకున్నా కఠిన చర్యలు తీసుకోవద్దని జిల్లాల అధికారులకు రహస్యంగా ఆదేశాలు ఇచ్చారు.
కాని ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొంత అప్రమత్తమై సిఎంఆర్ ధాన్యంపై కొరడా ఝళిపించడంతో పాత అక్రమాలు ఎక్కడ బయట పడతాయోనని అధికారులు, నేతలు వణికిపోతున్నారు. గడిచిన పదేళ్ళల్లో రాష్ట్ర పౌర సరఫరా శాఖను రూ. 65 వేల కోట్ల అప్పుల్లో ముంచి వడ్డీల భారాన్ని పెంచిన అక్రమ మిల్లర్లు మాత్రం సర్కారీ డబ్బుతో రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి కోట్లకు పడగలెత్తారు.