బిజెపి ప్రధాన కార్యదర్శి కేశవ్ ప్రసాద్ దాఖలు చేసిన పరువునష్టం కేసు సందర్భంగా ప్రత్యేక ఎంపి/ ఎంఎల్‌ఎ కోర్టు శనివారం కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌లకు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి బిజెపి ప్రభుత్వం 40 శాతం కమిషన్ వసూలు చేస్తున్నదనే ఆరోపణతో పూర్తి పేజి అడ్వర్టైజ్‌మెంట్ల ప్రచురణ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రచారం సాగించిందని పిటిషన్ ఆరోపించింది. ఆ బిజెపి ప్రభుత్వాన్ని ’40 శాతం ప్రభుత్వం’గా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిలో అభివర్ణించింది. అప్పటి బిజెపి ప్రభుత్వం వివిధ ఉద్యోగాకు నిర్ధారించినట్లుగా పేర్కొంటున్న రేట్ కార్డ్‌ను ప్రదర్శిస్తూ పోస్టర్లను,అడ్వర్టైజ్‌మెంట్లను కూడా కాంగ్రెస్ సృష్టించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ, ఒక ప్రైవేట్ ఫిర్యాదు సందర్భంగా తాను స్వయంగా కోర్టుకు హాజరైనట్లు వెల్లడించారు. ‘ఈ కేసు స్వభావం రీత్యా సివిల్‌ది.
చట్ట పరిరక్షకునిగా, చట్టాన్ని పాటించే పౌరునిగా న్యాయమూర్తి ముందు స్వయంగా హాజరు కావడం ద్వారా బెయిల్ సంపాదించాను. కెపిసిసి అధ్యక్షుడు శివకుమార్, రాహుల్ గాంధీపై కూడా కేసు దాఖలైంది. రాహుల్ గాంధీ కూడా కోర్టులో హాజరవుతారు’ అని సిద్ధరామయ్య తెలిపారు. ‘కేసు సందర్భంగా ఇక ముందు హాజరు కానవసరం లేకుండా శాశ్వత ఇంజంక్షన్‌ను కూడా మేము కోరాం’ అని సిద్ధరామయ్య చెప్పారు. ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, బిజెపి నేతల ప్రకటనలు ప్రాతిపదికగా కాంగ్రెస్ పార్టీ అడ్వర్టైజ్‌మెంట్లు ఇచ్చిందని, దీనిని కోర్టులో సవాల్ చేస్తున్నామని చెప్పారు. సిఎం పదవి కోసం రూ. 2500 కోట్లు ఇచ్చారని బిజెపి నేతలు వెల్లడించారని, ఇతర ప్రతిష్ఠాకర పదవుల కోసం చెల్లించవలసిన మొత్తాలను కూడా ప్రస్తావించారని ఆయన తెలిపారు. ‘ఈ తరహా కేసును ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. ఏమి చేయాలో, ఎలా చేయాలో మాకు తెలుసు’ అని శివకుమార్ చెప్పారు.