Friday, December 20, 2024

నమో హ్యాట్రిక్!

- Advertisement -
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసిన అరగంట తర్వాత భారతావని ఎంతో ఆత్రుతతో ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. రెండు సార్లు అధికార పీఠంపై కూర్చున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే వరుసగా మూడోసారీ కైవసం చేసుకోబోతున్నారని మెజారిటీ సంస్థలు స్పష్టం చేశాయి. కమలం పార్టీని ఈ సారి ఎలాగైనా కట్టడి చేయాలన్న లక్షంతో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడినప్పటికీ ఓటర్లు విశ్వసించలేదని ఘంటా పథంగా చెప్పాయి. 400 సీట్లే లక్షంగా ఈ సారి బరిలోకి దిగిన కమల దళం నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి ఎక్కువలో ఎక్కువ 390 సీట్లు సాధిస్తుందని, అయితే ‘చార్ సౌ’ సాధ్యం కాదని కుండబద్ధలు కొట్టాయి. దైనిక్ భాస్కర్, జన్‌కీ బాత్, న్యూస్ నేషన్, రిపబ్లిక్ భారత్‌మాట్రిజ్, రిపబ్లిక్ పి మార్క్, ఇండియా న్యూస్‌డి డైనమిక్స్ తదితర సంస్థలు మళ్లీ బిజెపిదే అధికారమని చాటి చెప్పాయి. గతంతో పోల్చితే దక్షిణాదిలో కమలం మరింత విరబూయడం ఖాయంగా కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కైవసం చేసుకొని డబుల్ డిజిట్ దక్కించుకోబోతోందని వివరించాయి.

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో మమతతో హోరాహోరీగా తలపడుతున్న బిజెపి ఈ సారి అవసరమైతే టిఎంసిని మించిపోతోందని సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. ఇక ఇండియా కూటమి గరిష్టంగా 200 మార్కును చేరుకునే అవకాశాలున్నాయి. కొన్ని సంస్థలైతే ఆ కూటమికి 150 స్థానాలు కూడా గగనమేనని ఘం టాపథంగా చెప్పాయి. తెలంగాణలో లోక్‌సభ పోరు కాంగ్రెస్, బిజెపి నడుమే నువ్వా నేనా అన్నట్లుగా సాగినట్లు ఎగ్జిట్‌పోల్స్‌ను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఇద్దరికి సమాన సంఖ్యలో సీట్లు దక్కుతాయని చెబుతుండగా, మరికొన్ని మాత్రం ఓ అడుగుముందుకేసి కాంగ్రెస్‌తో పోల్చితే కమలం పార్టీ ఒకటి, రెండు స్థానాలు ఎక్కువ సాధించినా ఆశ్చర్య పోనక్కర్లేదని స్పష్టం చేశాయి. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బిఆర్‌ఎస్ ఒకటి లేదా సున్నా, ఎంఐఎం ఒక స్థానానికి పరిమితమవుతాయని వెల్లడించాయి. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎగ్జిట్‌పోల్స్ కాస్త గందరగోళానికి గురిచేశాయి. కొన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెబుతుండగా.. మరికొన్ని మళ్లీ జగన్ అధికార పీఠాన్ని తిరిగి దక్కించుకోబోతున్నారని చెప్పాయి. మెజారిటీ సంస్థలు మాత్రం టిడిపి,జనసేన,బిజెపి కూటమివైపే మొగ్గు చూపాయి.

లోక్‌సభ ఎన్నికలు-ఎగ్జిట్ పోల్స్

ఎన్‌డిఎ ఇండియా ఇతరులు
రిపబ్లిక్ పీమార్క్               359  154     30
ఇండియా న్యూస్‌డీడైనమిక్స్  371 125 47
రిపబ్లిక్ భారత్‌మ్యాట్రిజ్     353-368 118-133 43-48
జన్‌కీబాత్                 362-392 141-161 10-20
న్యూస్ నేషన్            340-378 153-169 21-23
దైనిక్ భాస్కర్           281-350 145-201 33-49

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News