న్యూఢిల్లీ : ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లతో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్ సోమవారం వెల్లడించారు. వారిలో 31.2 మంది మహిళా ఓటర్లు అని తెలిపారు. సోమవారంనాడిక్కడ ఎన్నికల కమిషనర్లతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విలేకరుల గోష్ఠిలో మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియలో 68 వేల పర్యవేక్షణ బృందాలు, ఒకటిన్నర కోట్ల మంది పోలింగ్, భద్రత సిబ్బంది పాల్గొన్నట్లు తెలియజేశారు. ‘ఈ సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో 31.2 కోట్ల మంది మహిళలతో సహా 64.2 కోట్ల మంది ఓటర్లు పాల్గొనడంతో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది’ అని సిఇసి తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రజాస్వామిక ప్రక్రియలో భాగస్వాములైన ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూ తమతమ సీట్ల నుంచి లేచి నిలబడి ఎన్నికల కమిషనర్ల్లు చప్పట్టు కొట్టి అభినందనలు తెలిపారు.
భారత్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 96.88 కోట్లుగా ఎన్నికలకు ముందు ఇసి ప్రకటించింది. ఎన్నికల కమిషనర్లను ‘లాపతా జెంటిల్‌మెన్’గా పేర్కొన్న సామాజిక మాధ్యమ మీమ్స్‌ను రాజీవ్ కుమార్ ప్రస్తావిస్తూ, ‘మేము ఎల్లప్పుడూ ఇక్కడే ఉన్నాం. ఎన్నడూ అదృశ్యం కాలేదు’ అని స్పష్టం చేశారు. ‘లాపతా జెంటిల్‌మెన్ తిరిగి వచ్చారు’ అని ఇప్పుడు మీమ్స్‌ను వదలొచ్చు అని వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం సుమారు నాలుగు లక్షల వాహనాలు, 135 ప్రత్యేక రైళ్లు, 1692 వైమానిక సార్టీలను ఉపయోగించినట్లు సిఇసి చెప్పారు. ‘2019 సార్వత్రిక ఎన్నికల్లో 540 రీపోల్స్ నిర్వహించగా 2024 ఎన్నికల్లో వాటి సంఖ్య 39 మాత్రమే’ అని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ మొత్తంగా 58.58 శాతంతో, లోయలో 51.05 శాతంతో నాలుగు దశాబ్దాలలోనే అత్యధిక పోలింగ్‌ను నమోదు చేసిందని కూడా సిఇసి తెలియజేశారు. 2024 ఎన్నికల్లో నగదు, ఉచితాలు, మాదకద్రవ్యాలు, మద్యంతో సహా రూ. 10 వేల కోట్ల విలువ మేరకు స్వాధీనం చేసుకున్నామన్నారు. 2019లో రూ. 3500 కోట్లు విలువ మేరకు స్వాధీనం చేసుకోవడమైంది’ అని రాజీవ్ కుమార్ వివరించారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దేశ వ్యాప్తంగా 150 మంది జిల్లా మెజిస్ట్రేట్‌లకు ఫోన్ చేసి వారిని ప్రభావితం చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. వదంతులు వ్యాప్తి చేయడం, ప్రతి ఒక్కరిని అనుమానించడం సరికాదని అన్నారు. ‘ఎవరైనా ఒకరు అందర్నీ (జిల్లా మెజిస్ట్రేట్లు/రిటర్నింగ్ అధికారులు) ప్రభావితం చేయగలుగుతారా ? ఇదెవరు చేశారో మాకు చెప్పండి. ఆ పనిచేసిన వ్యక్తిని మేము శిక్షిస్తాం. వదంతులు సృష్టించడం ప్రతి ఒక్కరిని అనుమానించడం ఎంతమాత్రం మంచిది కాదు’ అని రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. మంగళవారం నాటి ఎన్నికల కౌంటింగ్‌కు ముందు సీఈసీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా పార్టీల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నామని సిఇసి చెప్పారు. వాటన్నింటినీ పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. కంట్రోల్ యూనిట్స్ కదలికలను సిసిటివి కెమెరా ద్వారా మానిటరింగ్ చేయాలని కోరారని, ఆ పని తాము చేస్తామని వివరించారు. దురదృష్టవశాత్తు కొన్ని రాష్ట్రాల్లో హింస చెలరేగిందన్నారు. త్వరలో జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు పెడుతామని రాజీవ్ కుమార్ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు అక్కడి ఓటర్లు ఉత్సాహం చూపించారని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో చాలా సంతృప్తికర పరిస్థితులు ఉన్నాయని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధింగా అక్కడ దాదాపు 58శాతానికిపైగా ఓటింగ్ నమోదైందని గుర్తు చేశారు.