Friday, December 20, 2024

నైరుతి వానలపై ఆశలు

- Advertisement -
- Advertisement -

నాలుగు రోజుల క్రితం కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మొన్ననే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను, తాజాగా నిన్న తెలంగాణను పలకరించాయి. అనుకున్న సమయానికంటే ఈసారి కాస్త ముందుగానే నైరుతి అడుగుపెట్టిందని చెప్పాలి. దీనికి రేమాల్ తుపాను కూడా ఒక కారణం. తుపాను కారణంగా నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకుని, వారం రోజుల ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి. తుపాను కారణంగానే ఇటు కేరళలోనూ, అటు ఈశాన్య రాష్ట్రాలలోనూ ఒకేసారి వర్షాలు మొదలయ్యాయి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, దక్షిణాది రాష్ట్రాలలో జూన్‌లో కాస్త తక్కువ వర్షపాతం నమోదైనా, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే పలు దఫాలు ఘంటాపథంగా చెప్పిన నేపథ్యం లో అన్నదాతలలో ఆశలు మోసులెత్తుతున్నాయి.

సకాలంలో దుక్కి దున్ని, విత్తు విత్తి వర్షం కోసం ఆకాశం వైపు నిస్తేజంగా చూసే అన్నదాత ఈసారి కొండంత ధీమాగా ఉండటానికి వాతావరణ శాఖ వర్షాలపై పదే పదే మోసుకొస్తున్న ఈ చల్లని కబుర్లే కారణం. కేవలం రైతులే కాదు, ఈ ఏడాది ప్రచండమైన ఎండలతో తల్లడిల్లిపోయిన ప్రతి ఒక్కరూ వర్షాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో మొదలైన ఎల్‌నినో ప్రభావంతో నిరుడు వర్షాలు కురవలేదు సరికదా, ఈ ఏడాది ఎండలు మండిపోయాయి. అనేక రాష్ట్రాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. గుక్కెడు నీటి కోసం జనం అల్లాడిపోయారు. పచ్చని చెట్లతో అలరారే బెంగళూరు వంటి మహానగరం కూడా నీటి ఎద్దడికి బెంబేలెత్తిపోయిందంటే పరిస్థితి ఎంత విషమించిందో అర్థం చేసుకోవచ్చు.గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ 136 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా 59.2 మి.మి. వర్షపాతం మాత్రమే రికార్డు కావడం వర్షాభావ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో విశదపరుస్తోంది. దీనికితోడు ఎండల ప్రభావంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల తదితర ప్రధాన ప్రాజెక్టులలోనూ నీళ్లు అడుగంటాయి. ఒక దశలో బెంగళూరులో నెలకొన్న మంచినీటి ఎద్దడి హైదరాబాద్‌కూ తప్పదేమోనని అనిపించినా, రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా జలగండం నుంచి గట్టెక్కగలిగాం.

వర్షాభావం కారణంగా వ్యవసాయం కునారిల్లి, పంటల దిగుబడులు తగ్గి ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు కూడా మున్నెన్నడూ లేని రీతిలో భగ్గుమన్నాయి. ఈ ప్రభావం దేశ ఆర్ధిక పరిస్థితి మీద కూడా పడిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే అదృష్టవశాత్తూ వర్షాకాలం ఆగమనానికి ముందే ఎల్ నినో ప్రభావం బలహీనపడి లా నినా పుంజుకోవడం, భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడటం వంటి పరిస్థితుల కారణంగా అధిక వర్షాలకు సానుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. గమనించివలసిన విషయం ఏమిటంటే, వాతావరణ శాఖ అంచనాలు నిజమైన పక్షంలో, ఈ ఏడాది ఎండలు మండిపోయినట్లే, వానాకాలంలో అతివృష్టి కూడా కల్లోలం సృష్టించక మానదు. చిన్నపాటి వర్షానికే ఏళ్లూఊళ్లూ ఏకమయ్యే పరిస్థితి ఉన్న హైదరాబాద్ మహానగరం పరిస్థితి తలచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. డ్రైనేజీలు నిండిపోయి, వర్షపునీరు పోయే మార్గంలేక రోడ్లే కాలువలుగా మారే భాగ్యనగరంలో తెరచి ఉంచిన మాన్ హోళ్లు ఎందరి ప్రాణాలనో కబళించిన దాఖలాలు కోకొల్లలు.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తాత్కాలిక పరిష్కారానికి చర్యలు చేపట్టే అధికార గణం, సమస్య శాశ్వత పరిష్కారానికి నడుం బిగించకపోవడమే ఈ అనర్థాలకు కారణమవుతోంది. భారీ వర్షాలు కురవక ముందే, అధికార యంత్రాంగం రంగంలోకి దిగి మ్యాన్ హోళ్లు సరిచేయడం, డ్రైనేజీలలో పూడిక తీయడం, ప్రాజెక్టులు, రిజర్వాయర్ గేట్లకు మరమ్మతులు వంటివి చేపట్టాలి. అన్నదాతలకు కాలం కలసివస్తున్న ఈ సమయంలో సమయానుకూలంగా తగిన సలహాలు సూచనలు చేస్తూ వారిని ముందుకు నడిపించాల్సిన బాధ్యత వాతావరణ శాఖపై ఉంది. అలాగే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులోకి చేర్చి, అన్నదాతకు ప్రభుత్వాలు అండగా నిలబడవలసిన సమయమిది. ఎన్నికలు ముగిసి, రేపోమాపో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరనున్న నేపథ్యంలో పాలకులు రాబోయే భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని, అనర్థాలు జరగకుండా చూడటంతో పాటు నేలపై రాలే ప్రతి చినుకూ సద్వినియోగమయ్యేలా పథక రచన చేయడం తక్షణ ఆవశ్యకత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News