Saturday, January 18, 2025

హసన్‌లో ప్రజ్వల్ రేవణ్ణ ఘోర పరాజయం

- Advertisement -
- Advertisement -

మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన ప్రజ్వల్ రేవణ్ణ హసన్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ పటేల్ చేతిలో ఓటమిపాలయ్యారు. హసన్ లోక్‌సభ స్థానం నుంచి జెడియు అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజ్వల్ రేవణ్ణ 40,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ హసన్ లోక్‌సభ స్థానాన్ని చేజిక్కించుకోగలిగింది. గత ఏడాది జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వల్ తండ్రి, మాజీ ప్రధాని హెచ్‌డి డేవెగౌడ కుమారుడు హెచ్‌డి రేవణ్ణ చేతిలో హోలినర్సీపూర్ స్థానంలో శ్రేయాస్ పటేల్ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు హసన్ లోక్‌సభ స్థానంలో సిట్టింగ్ ఎంపి ప్రజ్వల్‌ను ఆయన ఓడించారు. ఏప్రిల్ 26న పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు ప్రజ్వల్‌కు చెందిన శృంగార వీడియోలు హసన్ నియోజకవర్గవ్యాప్తంగా విస్తృతంగా సర్కులేట్ అయ్యాయి. ప్రజ్వల్ ఓటమికి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా బిజెపికి చెందిన ఒక వర్గం పనిచేయడం కూడా పటేల్ విజయానికి కారణంగా తెలుస్తోంది.

హసన్‌లో ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకుల మనవళ్ల మధ్య భీకర పోరాగా హసన్ ఎన్నికను అభివర్ణించవచ్చు. హసన్ తాత హెచ్‌డి వేవెగౌడను శ్రేయాస్ పటేల్ తాత జి పుట్టస్వామి గతంలో హసన్ ఎంపి ఎన్నికల్లో ఓడించారు. కాగా..హసన్ ఎన్నిక ఫలితంపై ప్రజ్వల్ బాబాయ్, జెడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఫలితాన్ని తాము ఊహించలేదని, ఈ ఫలితం తమను అసంతృప్తికి గురిచేసిందని చెప్పారు. ఇలా ఉండగా..బిజెపి, జెడిఎస్ మధ్య ఎన్నికల పొత్తు కమలం పార్టీలో తీవ్ర అసమ్మతికి దారితీసింది. ప్రజ్వల్ అభ్యర్థిత్వాన్ని హసన్ మాజీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ తీవ్రంగా వ్యతిరేకించారు. 2019లో హసన్ స్థానాన్ని ప్రజ్వల్ కోసం దేవెగౌడ త్యాగం చేశారు. ఆ ఎన్నికల్లో 1.41 లక్షల ఓట్ల ఆధిక్యతతో ప్రజ్వల్ గెలుపొందారు. లైంగిక దాడి ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రజ్వల్ కచ్ఛితంగా గెలుస్తారని జెడిఎస్ నాయకులు ధీమాతో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News