మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో భారత వైమానిక దళం (ఐఎఎఫ్)కు చెందిన సుఖోయ్ ఫైటర్ విమానం మంగళవారం కూలిపోయిందని పోలీసులు వెల్లడించారు. పైలట్, కో పైలట్ సురక్షితంగా దూకారని నాసిక్ రేంజ్ ప్రత్యేక ఇన్‌స్పెక్టర్ జనరల్ డిఆర్ కరాలె ‘పిటిఐ’తో చెప్పారు. షిరాస్‌గావ్ గ్రామం సమీపంలోని ఒక పొలంలో విమానం కూలిందని ఐపిఎస్ అధికారి కరాలె తెలిపారు. వింగ్ కమాండర్ బోకిల్,
సహ పైలట్ బిశ్వాస్ నడుపుతున్నఫైటర్ జెట్ మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటలకు నిఫాద్ తెహసీల్‌లోని షిరాస్‌గావ్‌లో ఒక పొలంలో కూలింది. పైలట్లు ఇద్దరూ సురక్షితంగా బయట పడ్డారని, వారికి స్వల్ప గాయాలు అయ్యాయని మరొక పోలీస్ అధికారి తెలియజేశారు. వారిని హెచ్‌ఎఎల్ ఆసుపత్రికి తరలించారు. విమానం కూలిన తరువాత మంటలు అంటుకున్నాయి. మంటలను ఆర్పివేశారు. విమానం భాగాలు 500 మీటర్ల పరిధిలో పడ్డాయని ఆయన తెలిపారు. ఐఎఎఫ్, హెచ్‌ఎఎల్ భద్రత, సాంకేతిక విభాగాల బృందాలు ఆ ప్రదేశాన్ని సందర్శించారు.