400 పైగా సీట్లు గెలుస్తుందని చెబుతూ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేశారని, కానీ ఆ పార్టీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయిందని, కనుక ఆయన ‘నైతిక పరాజయం అంగీకరించి’ వెంటనే రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం అన్నారు. మమత విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, కేంద్రంలో మోడీని పదవిలో నుంచి లేకుండా చేసి, ఇండియా కూటమి వచ్చేలా చూసేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు. ‘ప్రధాని మోడీ విశ్వసనీయత కోల్పోయారు.
ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఇండియా గెలిచింది. మోడీ ఓడారు. ప్రధాని పలు పార్టీలను చీల్చారు. ఇప్పుడు ప్రజలు ఆయన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీశారు. మోడీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు టిడిపి, నితీశ్ (కుమార్) కాళ్లపై పడుతున్నారు’ అని ఆమె అన్నారు. ‘కేంద్ర సంస్థల అత్యాచారాలు, దుర్వినియోగం ఇప్పుడు ఓడిపోయాయి. కేంద్ర సంస్థలను, పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీని ఉపయోగించుకుని మమ్మల్ని బెదరిస్తూ వచ్చిన బిజెపిని మేము వదలం. మేము వారిని క్షమించం, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు కూడా వారిని క్షమించి వదలవు’ అని మమత చెప్పారు.