భారతీయ జనతా పార్టీ (బిజెపి) లోక్‌సభ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా ఖాతా తెరిచింది. నటుడు, రాజకీయ నాయకుడు, బిజెపి తరఫున పోటీ చేసిన సురేష్ గోపి 72 వేలకు పైగా వోట్ల ఆధిక్యంతో త్రిస్సూర్ లోక్‌సభ సీటును గెలుచుకున్నారు. అయితే, ఈ దక్షిణాది రాష్ట్రంలో మెరుగైన ప్రదర్శన చేసిన పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీ 20 సీట్లలోకి 13 సీట్లలో గెలవడమో ఆధిక్యంలో ఉండడమో జరిగింది. సిపిఐ (ఎం), ఐయుఎంఎల్ చెరి రెండు సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.
తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ నేత శశి థరూర్, బిజెపి నేత రాజీవ్ చంద్రశేఖర్ మధ్య పోటీ తీవ్ర స్థాయిలో జరిగింది. సిట్టింగ్ ఎంపి థరూర్ తన ప్రత్యర్థి రాజీవ్ చంద్రశేఖర్‌ను ఓడించి నియోజకవర్గాన్ని నిలబెట్టుకున్నారు. కేరళలో మరొక ప్రముఖ విజయం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీది. ఆయన సిపిఐ అభ్యర్థి అన్నీ రాజాను, బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె సురేంద్రన్‌ను వయనాడ్ నియోజకవర్గంలో ఓడించారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలి నుంచి కూడా గెలిచిన రాహుల్ ఇప్పుడు ఏ సీటు వదులుకుంటారో చూడాలి.