లక్నో: లోక్‌సభ ఎన్నికలలో తగిన ప్రాతినిధ్యం లక్పించినప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్‌పి)ని అర్థం చేసుకోవడంలో ముస్లింపల విఫలం అయ్యారని ఆ పార్టీ అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి వ్యాఖ్యానించారు. చాలా ఆలోచించే ముస్లింలకు సముచిత ప్రాధాన్యం కల్పించామని బుధవారం నాడిక్కడ ఆమె తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిఎస్‌పి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒక్క స్థానాన్ని కూడా బిఎస్‌పి సాధించలేకపోయింది. 2014 ఎన్నికలలో కూడా ఆ పార్టీ యుపిలో ఖాతా తెరవలేదు. అయితే 2019 ఎన్నికలలో సమాజ్‌వాది పార్టీతో చేతులు కలిపి 10 స్థానాలు గెలుచుకోగలిగింది.
ఎన్నికల ఫలితాలపై తమ పార్టీ లోతుగా విశ్లేషించుకుని పార్టీ ప్రయోజనాల కోసం తీసుకోవలసిన చర్యల గురించి నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె తెలిపారు. కాగా, తనకు మద్దతు తెలిపిన దళిత కులాలకు ముఖ్యంగా జాటవ్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అయితే ముస్లింల పట్ల ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బిఎస్‌పిలో ముఖ్య భాగమైన ముస్లిం ప్రజలకు గత ఎన్నికలతోపాటు ఈ ఎన్నికలలో కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించినప్పటికీ తమ పార్టీని అర్థం చేసుకోవడంలో వారు విఫలమయ్యారని ఆమె విమర్శించారు.
అటువంటి పరిస్థితులలో భవిష్యత్తులో పార్టీ ఈ రకమైన ఓటమిని చివిచూడకుండా నివారించడానికి తగిన నిర్ణయాన్ని తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో బిఎస్‌పి 35 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించింది. ఎన్నికల ఫలితాలు వెలువడినందున దేశ ప్రజాస్వామ్యం, దాని ప్రయోజనాలు, రాజ్యాంగం గురించి ఆలోచించవలసిన బాధ్యత భావి నాయకులపైన ఉందని మాయావతి అన్నారు. లోక్‌సభ ఎన్నికలను తీవ్ర వేసవి కాలంలో నిర్వహించడంపై కూడా ఆమె అభ్యంతరం తెలిపారు. సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ వల్ల సామాన్య ప్రజలతోపాటు లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు విసిగిపోయారని ఆమె తెలిపారు. గరిష్ఠంగా మూడు లేదా నాలుగు దశలలో ఎన్నికలు నిర్వహించాలని ఆమె సూచించారు.