Monday, December 23, 2024

ప్రధాని మోడీ రాజీనామా

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారని, ఆమె దానిని ఆమోదించి, కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించేంత వరకు కొనసాగవలసిందిగా ఆయనను కోరారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ‘ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతిని బుధవారం కలుసుకుని, తన మంత్రి మండలితో పాటు తన రాజీనామాను సమర్పించారు. ‘రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించి, కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించేంత వరకు కొనసాగవలసిందిగా నరేంద్ర మోడీకి, మంత్రి మండలికి విజ్ఞప్తి చేశారు’ అని ఆ ప్రకటన వివరించింది. అంతకు ముందు బుధవారం కేంద్ర మంత్రివర్గం 17వ లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేసిందని అధికార వర్గాలు తెలియజేశాయి.

ప్రస్తుత లోక్‌సభ గడువు ఈ నెల 16న ముగుస్తుంది. అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) మంగళవారం లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించింది. ఎన్‌డిఎ 543 మంది సభ్యుల లోక్‌సభలో మెజారిటీ స్థాయి 272కు మించి సుఖప్రదమైన స్థానంలో ఉండగా, 240 సీట్లు గెలిచిన బిజెపి 2014 తరువాత సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. ప్రభుత్వం ఏర్పాటుకు తన మిత్ర పక్షాలపై బిజెపి ఆధారపడవలసి వస్తోంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ 2019లోని 52తో పోలిస్తే ఈ ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకున్నది. రాజస్థాన్, హర్యానాలలో బిజెపి సీట్ల వాటాను కాంగ్రెస్ దెబ్బ తీసింది.

జయాపజయాలు రాజకీయాల్లో భాగమే : మోడీ
ఇది ఇలా ఉండగా, మూడవ సారిప్రధానిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ప్రధానిగా రాజీనామా చేయడానికి ముందు మోడీ బుధవారం ఉదయం తన క్యాబినెట్ మంత్రులను ఉద్దేశించి ప్రసంగించారని, ‘జయాపజయాలు రాజకీయాల్లో కేవలం ఒక భాగం’ అని వారితో ఆయన అన్నారని అధికార వర్గాలు తెలిపాయి. 2019లో పోలిస్తే 2024 ఎన్నికల్లో బిజెపి ప్రదర్శన గణనీయంగా దెబ్బ తిన్న నేపథ్యంలో మోడీ ఆ వ్యాఖ్యలు చేశారు. ‘జయాపజయాలు రాజకీయాల్లో భాగం. సంఖ్యల ఆట కొనసాగుతూనే ఉంటుంది.

పది సంవత్సరాల పాటు మనం మంచి పని చేశాం. భవిష్యత్లులో కూడా అదే విధంగా సాగుతాం’ అని ఆయన చెప్పారు. ప్రధాని నివాసంలో ఉదయం 11.30 గంటలకు సమావేశం మొదలైంది. ‘అధికార వ్యవస్థ ప్రతి చోట ప్రజల ఆశలకు అనుగుణంగా పని ఏసింది. మున్ముందు కూడా అదే విధంగా చేస్తుంది. మీరంతా బాగా పని చేశారు. బాగా ఎక్కువగా కృషి చేశారు’ అని మోడీ తన మంత్రి మండలితో చెప్పారు. మోడీ రెండవ క్యాబినెట్, మంత్రి మండలి చివరి సమావేశం ఇది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను మంగళవారం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News