లోక్‌సభ ఎన్నికల ఫలితాలను చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లుసి) ఈనెల 8న(శనివారం) సమావేశం కానున్నది. ఈ సమావేశం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరగనున్నది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి పార్టీ నాయకులు చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందని వారు చెప్పారు. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లతో లోక్‌సభలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
2019 ఎన్నికలలో 52 సీట్లు గెలుపొందగా ఇప్పుడు ఆ సంఖ్య 99కి పెరిగింది. పదేళ్ల విరామం అనంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా కాంగ్రెస్‌కు దక్కుతోంది. 2014, 2019 ఎన్నికలలో లోక్‌సభలోని మొత్తం స్థానాలలో 10 శాతం స్థానాలను కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోవడంతో ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా పార్టీకి దక్కలేదు. శనివారం జరిగే సిడబ్లుసి సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోసహా పార్టీ అగ్ర నాయకులందరూ పాల్గొంటారని వర్గాలు తెలిపాయి.