Friday, December 20, 2024

వందే భారత్ సగటు వేగం తగ్గింది

- Advertisement -
- Advertisement -

వందే భారత్ రైళ్ల సగటు వేగం 2020-21 లోని గంటకు 84.84 కిలోమీటర్ల నుంచి 2023- 24లో గంటకు 76.25 కిలోమీటర్లకు తగ్గిందని రైల్వే మంత్రిత్వశాఖ ఒక ఆర్‌టిఐ ప్రశ్నకు సమాధానంలో తెలియజేసింది. ‘భారీ స్థాయిలో మౌలిక వసతుల కల్పన పని’ కారణంగా కొన్ని చోట వందే భారత్ రైళ్లే కాకుండా అనేక ఇతర రైళ్లు కూడా ముందు జాగ్రత్తగా తక్కువ వేగంతో వెళుతున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ‘అంతే కాదు. సంక్లిష్టమైన ప్రాంతాల్లో కొన్ని వందే భారత్ రైళ్లును ప్రారంభించడమైంది. అక్కడ భౌగోళిక కారణాలు లేదా తీవ్ర వాతావరణ పరిస్థితుల దృష్టా వేగంపై పరిమితులు ఉన్నాయి’ అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ముంబయి సిఎస్‌ఎంటి, మద్గావ్ మధ్య వందే భారత్ రైలును ఒక ఉదాహరణగా సెంట్రల్ రైల్వే జోన్ అధికారి ఒకరు ఉటంకిస్తూ, ‘కొంకణ్ రైల్వే ప్రాంతం చాలా వరకు ‘ఘాట్’ సెక్షన్. అక్కడ రైళ్లు తక్కువ ఎత్తు ఉన్న పర్వత శ్రేణుల మీదుగా వెళుతుంటాయి. అది సంక్లిష్టమైన ప్రదేశం.

వేగం పెంపు భద్రతపై రాజీ పడడమే అవుతుంది’ అని వివరించారు. ‘వర్షాకాలంలో పరిస్థితులు అత్యంత సవాల్‌గా మారతాయి. అన్ని రైళ్లకు గరిష్ఠ వేగాన్ని గంటకు 75 కిలోమీటర్లుగా పాటించవలసి ఉంటుంది’ అని ఆయన చెప్పారు. ఆర్‌టిఐ ద్వారా సంపాదించిన డేటా ప్రకారం వందే భారత్ రైళ్ల సగటు వేగం 2020-21లో 84.48గా ఉండగా, అది 2022-23లో 81.38కి, 2023-24లో 76.25కు తగ్గింది’ అని ఆర్‌టిఐ దరఖాస్తుదారుడు మధ్య ప్రదేశ్‌కు చెండిన చంద్రశేఖర్ గౌర్ తెలియజేశారు. 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించిన వందే భారత్ సెమీ హై స్పీడ్ రైలు. అది గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అయితే, అది ఢిల్లీ- ఆగ్రా మార్గంలో మినహా దేశంలో ఎక్కడా అనువుగాని రైలుమార్గం పరిస్థితుల కారణంగా గంటకు 130 కిలోమీటర్లకు మించి వెళ్లజాలదు. ‘ఢిల్లీ, ఆగ్రా మధ్య కొన్ని ట్రాక్ సెగ్మెంట్లను దేశంలో తొలి సెమీ హై స్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ కోసం 2016లో అభివృద్ధి చేయడమైంది.

ఆ సెగ్మెంట్లలో మాత్రమే వందే భారత్ కూడా గంటకు 160 కిమీ వేగంతో వెళుతుంది. తక్కిన ప్రదేశాల్లో దాని గరిష్ఠ వేగం గంటకు 130 కిమీ లేదా అంతకు తక్కువ’ అని మరొక రైల్వే అధికారి వివరించారు. రైల్వే శాఖ వందే భారత్ వేగం అవసరాల కోసం రైలు పట్టాలను అప్‌గ్రేడ్ చేస్తున్నదని,‘ఈ కారణాలతోనే వివిధ ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నారు’ అని ఆయన తెలిపారు. ‘రైలు పట్టాల అప్‌గ్రేడ్‌లు పూర్లి అయిన తరువాత గంటకు 250 కిమీ వేగానికి పెంచగలం’ అని ఆ అధికారి తెలిపారు. వందే భారత్ వేగం సగటు వేగం కన్నా తక్కువగా ఉన్న రూట్లు కొన్ని డెహ్రాడూన్- ఆనంద్ విహార్ (గంటకు 63.42 కిమీ), పాట్నా– రాంచీ (గంటకు 62.9 కిమీ), కోయంబత్తూరు- బెంగళూరు కంటోన్మెంట్ (గంటకు 58.11 కిమీ). తొలి వందే భారత్‌ను 2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టడమైందని, ఆ తరువాత ఐదు సంవత్సరాలకు పైగా గడిచాయని,

కానీ ఈ రైలు గరిష్ఠ నిర్వహణ వేగం గంటకు 160 కిమీ అందుకునేలా ఏ రూట్‌లోనూ పట్టాలను రైల్వే శాఖ ఇంతవరకు మార్చలేదని పట్టాల నిర్మాణంలో పాల్గొనే ఒక నిపుణుడు చెప్పారు. అయితే, వందే భారత్ రైళ్లు అత్యంత ప్రజాదరణ పొందాయని, మార్చి 31 వరకు 2.15 కోట్ల మందికి పైగా ఈ రైళ్లలో ప్రయాణించారిన రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News