Saturday, November 23, 2024

నీట్‌గా కాపీ!.. హర్యానాలోని ఒకే సెంటర్‌లో ఆరుగురికి 100% మార్కులు

- Advertisement -
- Advertisement -

నీట్ యుజి ఫలితాలపై ముదురుతున్న వివాదం
హర్యానాలో ఒక సెంటర్‌లో ఒకే గదిలో పక్కపక్కనే
కూర్చుని పరీక్ష రాసిన 8 మందికి 720 మార్కులు
ఈ ఘటనతో పేపర్ లీక్..? లేక మాస్ కాపీయింగ్
జరిగినట్లు అనుమానిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రుల
ఈ పరీక్ష నెగెటివ్ మార్కులు ఉండగా,
718,719 మార్కులు రావడంపై సందేహాలు
గ్రేస్ మార్కులు కలిపడం వల్లనే ఇలా మార్కులు
వచ్చాయని వివరణ ఇచ్చిన ఎన్‌టిఎ
ఏ ప్రాతిపదినక గ్రేస్ ఇచ్చారో చెప్పకపోవడంతో
ఎన్‌టిఎ తీరు పట్ల విద్యార్థుల ఆగ్రహం
మనతెలంగాణ/హైదరాబాద్ : వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యుజి ఫలితాలపై వివాదం క్రమంగా ముదురుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఈనెల 4వ తేదీన నీట్ 2024 ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 13 లక్షల మందికి పైగా అభ్యర్థులు నీట్ యుజి పరీక్షలో ఉత్తీర్ణులు కాగా, వారిలో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు.

ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎలా అగ్రస్థానంలో నిలిచారనే దానిపై వివాదం నెలకొంది. ఓ పరీక్షా కేంద్రంలో ఒకే గదిలో పరీక్ష రాసిన విద్యార్థుల్లో పక్కపక్కనే కూర్చున్న వారిలో 8 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం ఈ పరీక్షలో ప్రశ్నాపత్నం లీక్ అయ్యిందా..? లేక మాస్ కాపీయింగ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది విద్యార్థులకు గ్రేస్ ఇచ్చామని చెబుతున్న ఎన్‌టిఎ, ఏ ప్రాతిపదికన గ్రేస్ మార్కులు ఇచ్చారో చెప్పకపోవడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్‌టిఎ స్పందిస్తున్న తీరు పట్ల విద్యార్థుల ఆగ్రహం
నీట్ యుజి పరీక్షలో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. 720 మార్కులకు గానూ నీట్ యుజి పరీక్షను పెన్, పేపర్ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానానికి నాలుగు మార్కులు, తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. ఎవరైనా అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం రాస్తే వారికి 720 మార్కులు వస్తాయి.

ఎవరైనా ఒక ప్రశ్నను వదిలివేస్తే, 4 మార్కులు తగ్గి 716 మార్కులు వస్తాయి. ఎవరైనా ఒక ప్రశ్నకు తప్పుగా సమాధానం ఇస్తే అతనికి 4 మార్కులతో పాటు తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గి అంటే మొత్తం 5 మార్కులు తగ్గి 715 మార్కులు వస్తాయి. కానీ ఈసారీ నీట్ యుజి పరీక్షలు కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావడం పట్ల అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా ఎన్‌టిఎ వివరణ ఇచ్చింది. కొన్ని కేంద్రాల్లో పరీక్ష నిర్వహణలో జాప్యంపై 1,563 మంది అభ్యర్థులు హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారని, వారికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం గ్రేస్ మార్కులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇలా గ్రేస్ మార్కులు పొందిన వారిలో మైనస్ 20 నుంచి 720 వరకు మార్కులు వచ్చిన విద్యార్థులూ ఉన్నారని తెలిపింది.

నీట్ పరీక్షలో విద్యార్థులు సమయం కోల్పోవడం వల్ల వారు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే గ్రేస్ మార్కులు ఇచ్చామని వివరించింది. గ్రేస్ మార్కుల వల్ల మాత్రమే ఈ వ్యత్యాసం కనిపిస్తుందని పేర్కొంది. అందుకే 718 లేదా 719 మార్కులు వేయాల్సి వచ్చిందని తెలిపింది. నీట్ పరీక్షలో కెమిస్ట్రీపై ఒక ప్రశ్న వచ్చింది. దీనికి సంబంధించి వివాదం ఉంది. ఈ ప్రశ్నకు ఇచ్చిన ఆప్సన్లలో రెండు సమాధానాలు సరైనవే. నిజానికి, ఎన్‌సిఇఆర్‌టి పాత పుస్తకంలో, ఒక సమాధానం సరైనదిగా చూపబడింది. కొత్త పుస్తకంలో మరొక సమాధానం సరైనదిగా చూపబడింది. దీంతో రెండు సమాధానాలు రాసిన అభ్యర్థులకు మార్కులు వచ్చాయి. దీంతో అధిక సంఖ్యలో విద్యార్థులు పూర్తి మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారని ఎన్‌టిఎ పేర్కొంది.అయితే ఎన్‌టిఎ వివరణపై, ఈ వివాదంపై ఎన్‌టిఎ స్పందిస్తున్న తీరు పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏ ప్రాతిపదికన, ఎంత గ్రేస్ మార్క్‌లు ఇచ్చారో చెప్పని ఎన్‌టిఎ
నీట్ పరీక్షలో కొన్ని సెంటర్లలో విద్యార్థులు సమయం కోల్పోవడం వల్ల వారు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే గ్రేస్ మార్కులు ఇచ్చామని ఎన్‌టిఎ వివరించింది. అయితే ఏ ప్రాతిపదికన ఎంత గ్రేస్ మార్క్ ఇచ్చారో మాత్రం ఎన్‌టిఎ స్పష్టత ఇవ్వలేదు. కేవలం కోర్టుకు వెళ్లిన విద్యార్థులకు మాత్రమే గ్రేస్ మార్కులు ఇచ్చారని, మిగతా విద్యార్థులకు గ్రేస్ మార్కులు కేటాయించకపోవడం పట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా సెంటర్లలో పేపర్ ఆలస్యంగా రావడం వల్ల విద్యార్థులు సమయంలో కోల్పోయారని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. గ్రేస్ మార్కుల ఇవ్వడంపై ఎన్‌టిఎ వివరణ సంతృప్తికరంగా లేదని, విద్యార్థులు ఎంత సమయం కోల్పోతే ఎంత గ్రేస్ మార్కులు ఇచ్చారో ప్రతిపాదిక వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. నీట్ యుజి పరీక్ష రాసిన విద్యార్థుల సందేహాలు ఎన్‌టిఎ నివృత్తి చేయాలని, అప్పుడే పరీక్ష పారదర్శకంగా జరిగినట్లుగా అందరూ భావిస్తారని పేర్కొంటున్నారు.

నీట్ ప్రశ్నాపత్రం లీక్ లేక మాస్ కాపీయింగ్..?
ఈ సారి నీట్ పరీక్షలో పేపర్ లీక్ అయ్యిందని కొందరు, భారీ స్కామ్ జరిగిదని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. ఈ పరీక్షలో కొన్ని కేంద్రాలలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలో ఓ పరీక్షా కేంద్రంలో ఒకే గదిలో పరీక్ష రాసిన విద్యార్థుల్లో పక్కపక్కనే కూర్చున్న వారిలో 8 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం ఈ పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగిందన్న ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతున్నది. యాధృచ్చికంగా ఇలా జరిగే అవకాశం ఉండదని, మాస్ కాపీయింగ్ లేక పేపర్ లీక్ అయితే తప్ప ఇలా ఒకే సెంటర్‌లో ఒకే గదిలో పరీక్ష రాసిన విద్యార్థులు పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉండదని పేర్కొంటున్నారు. కార్పోరేట్ విద్యాసంస్థలు నీట్ యుజి పరీక్షలో అవకతవకలకు పాల్పడినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.

కోర్టుకు చేరిన వ్యవహారం..
నీట్ యుజి 2024 పరీక్షను తిరిగి నిర్వహించాలని కోరుతూ కొందరు విద్యార్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడం, ఇతర వివాదాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మే 5న నిర్వహించని పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మే 5న జరిగిన నీట్ యుజి పరీక్షలో అక్రమాలకు జరిగాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీ, కలకత్తా హైకోర్టులలో కేసులు దాఖలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News