నలుగురు సభ్యుల కమిటీ నియామకం
కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ చర్య
నీట్ యుజి వివాదం
న్యూఢిల్లీ : నీట్ యుజి వైద్య ప్రవేశ పరీక్షలో ఇతోధిక మార్కుల కేటాయింపుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులపై సమీక్షకు నలుగురు సభ్యుల బృందాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిందని జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టిఎ) శనివారం ప్రకటించింది. పరీక్ష నిర్వహణ, గ్రేస్ మార్కుల కేటాయింపులో అవకతవకలు ఏవీ జరగలేదని ఎన్‌టిఎ స్పష్టం చేసింది. ఎన్‌టిఎ పాఠ్యపుస్తకాల్లో చేసిన మార్పులు, పరీక్ష కేంద్రాల్లో సమయం నష్టానికి గ్రేస్ మార్కులు ఇవ్వడం విద్యార్థులు అధిక మార్కులు పొందడం వెనుక కారణాలని ఎన్‌టిఎ వివరించింది. ఈ వివాదం రాజకీయ మలుపు కూడా తీసుకున్నది.
అవకతవకల ఆరోపణలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సిట్ దరాయప్తు జరిపించాలని ఆప్ కోరింది. పేపర్ లీక్‌లు, రిగ్గింగ్, అవినీతి అనేక పరీక్షల్లో అంతర్భాగంగా మారాయని కాంగ్రెస్ ఆరోపించింది. బిజెపి యువజనులను వంచిస్తోందని, వారి భవిష్యత్తుతో ఆడుకుంటోందని కూడా కాంగ్రెస్ ఆరోపించింది. ఆరు పరీక్ష కేంద్రాల్లో సమయం నష్టాన్ని భర్తీ చేయడానికి గ్రేస్ మార్కులు కేటాయించడం విపరీత స్థాయికి మార్కులు చేరడానికి దారి తీసిందని, ఇతర అభ్యర్థుల అవకాశాలను దెబ్బ తీసిందని ఆరోపిస్తూ తిరిగి పరీక్ష నిర్వహించాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఆ కేంద్రాలు మేఘాలయ, హర్యానాలోని బహదూర్‌గఢ్, ఛత్తీస్‌గఢ్‌లోని దాంతెవాడ, బలోధ్, గుజరాత్‌లోని సూరత్, చండీగఢ్. వైద్య ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈ నెల 4న ప్రకటించారు.
పరీక్షలో 67 మంది అభ్యర్థులు మొదటి ర్యాంకు పంచుకున్నారు. వారిలో హర్యానాలోని ఒకే కేంద్రం నుంచి ఆరుగురు కూడా ఉన్నారు. ‘1500 మందికి పైగా అభ్యర్థుల ఫలితాల సమీక్ష నిమిత్తం ఒక ఉన్నతాధికార కమిటీ ఏర్పాటైంది. యుపిఎస్‌సి మాజీ చైర్మన్ సారథ్యంలోని నలుగురు సభ్యుల బృందం ఒక వారంలోగా తన సిఫార్సులు సమర్పిస్తుంది. ఆ అభ్యర్థుల ఫలితాల సమీక్ష జరగవచ్చు’ అని ఎన్‌టిఎ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ ఢిల్లీలో విలేకరుల గోష్ఠిలో తెలియజేశారు. ‘గ్రేస్ మార్కుల కేటాయింపు పరీక్ష అర్హత నిబంధనను ప్రభావితం చేయలేదు. బాధిత అభ్యర్థుల ఫలితాల సమీక్ష అడ్మిషన్ ప్రక్రియను ప్రభావితం చేయదు’ అని ఆయన స్పష్టం చేశారు. నీట్ యుజి 2024 ఫలితాల్లో విపరీత స్థాయిలో మార్కులు వేయడం ఈ ఏడాది వైద్య కళాశాలలో సీటు సాధన మరింత కష్టం కావచ్చునని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫలితాలను రద్దు చేసి, తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరేందుకు కొందరు అభ్యర్థులు ఆన్‌లైన్ వేదికలను ఆశ్రయించారు. కొందరు విద్యార్థులకు పరీక్షను తిరిగి నిర్వహిస్తారా అని ప్రశ్నించగా, కమిటీ సిఫార్సులను బట్టి దానిని నిర్ణయిస్తారని ఎన్‌టిఎ డిజి సమాధానం ఇచ్చారు.
‘సమయం కోల్పోయిన విద్యార్థులు లేదా ఇతర విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా చూడడమే ఉద్దేశం’ అని ఆయన చెప్పారు. ఏ పేపరూ లీక్ కాలేదని, పరీక్షలు అవకతవకలు జరగలేదని సింగ్ స్పష్టం చేశారు. ఈ కీలక పరీక్ష సమగ్రతపై రాజీ పడలేదని ఆయన పునరుద్ఘాటించారు. వైద్య కోర్సులకు జాతీయ పరీక్ష సాధికారతపై ఈ ఫలితాలు ఆందోళనలు లేవనెత్తాయని కేరళలో కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ప్రక్రియపై అనేక మంది విద్యార్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని పార్టీ తెలిపింది. ‘ఇందుకు మోడీ ప్రభుత్వం నేరుగా బాధ్యురాలు. నియామక పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు పెక్కు అవకతవకలను ఎదుర్కొనడం, పేపర్ లీక్‌ల సంక్షోభంలో చిక్కుకోవడం వారి భవిష్యత్తుతో ఆడుకోవడమే. బిజెపి దేశ యువతను మోసం చేసింది’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హిందీ ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆరోపించారు. క్రితం నెల నిర్వహించిన నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది.
రాష్ట్రం నుంచి విద్యార్థులకు ఈ ఫలితాలు అన్యాయం చేశాయని ప్రభుత్వం ఆరోపించింది. నీట్ ఫలితాల తాజా సరళి పరీక్షను వ్యతిరేకిస్తున్న డిఎంకె వైఖరి సరైనదేనని నిర్ధారించిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ ప్రవేశ పరీక్ష సామాజిక న్యాయానికి, ఫెడరలిజానికి విరుద్ధమని ఆయన అన్నారు. నీట్ యుజి పరీక్షలో అక్రమాలు జరిగాయని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ శనివారం ఆరోపించారు. కోర్లు ఈ వ్యవహారాన్ని ఐచ్ఛికంగా పరిగణనలోకి తీసుకుని, సమగ్ర దర్యాప్తు నిర్వహించి, దోషులకు కఠిన శిక్ష విధించాలని అఖిలేశ్ కోరారు.