Saturday, December 21, 2024

ఇండియా కూటమి సంఘటితంగా వ్యవహరించాలి

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్‌లోను, వెలుపలా కూటమి పాత్ర అదే
లోక్‌సభ ఎన్నికల తీర్పు విభజనవాద రాజకీయాలకు తిరస్కరణ
సిడబ్లుసి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తీర్పు విభజనవాద, విద్వేష రాజకీయాలకు ‘నిర్ణయాత్మక తిరస్కరణ’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం ఢిల్లీలో పార్టీ కార్యవర్గం (సిడబ్లుసి) సమావేశంలో స్పష్టం చేశారు. ఇండియా కూటమి పార్లమెంట్‌లోను, వెలుపలా సంఘటితంగా వ్యవహరిస్తూనే ఉండాలని ఖర్గే నొక్కిచెప్పారు. ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించాలని రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు కూడా. ఖర్గే సిడబ్లుసి సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ, పార్టీ ఒక వైపు ‘పునరుత్థానాన్ని’ వేడుక చేసుకుంటూనే, మరొక వైపు ఒకింత ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో పార్టీ ప్రదర్శన తన సామర్థానికి, అంచనాలకు తగినట్లుగా లేదని ఆయన చెప్పారు. ప్రజలు కాంగ్రెస్‌పై తమ విశ్వాసాన్ని తిరిగి వ్యక్తం చేశారని, ‘నిరంకుశ శక్తులకు’, రాజ్యాంగం వ్యతిరేకులకు వారు గట్టి సమాధానం ఇచ్చారని ఖర్గే ఉద్ఘాటించారు.

‘అధికార పార్టీ నియంతృత్వ, ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతులకు వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడారు. గడచిన పది సంవత్సరాల రాజకీయాలకు అది కచ్చితమైన తిరస్కరణ. విభజనవాద, విద్వేష రాజకీయాలకు తిరస్కరణ’ అని ఆయన పేర్కొన్నారు. అననుకూల పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలిచినందుకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపిలను ఆయన అభినందించారు. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర సాగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ వోట్ల వాటా, సీట్ల సంఖ్య పెరిగినట్లు ఖర్గే తెలియజేశారు. ‘భారత్ జోడో యాత్ర సాగిన చోట్ల కాంగ్రెస్ పార్టీ వోట్ల శాతం, సీట్ల సంఖ్య పెరగడం చూశామని మీ దృష్టికి తెస్తున్నా’ అని ఆయన చెప్పారు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలను కూడా ఆయన అభినందించారు. ప్రతి పార్టీ వేర్వేరు రాష్ట్రాల్లో తనకు నిర్దేశించిన పాత్ర పోషించిందని, ప్రతి పార్టీ ఇతర పార్టీల విజయానికి తోడ్పడిందని ఆయన తెలిపారు.

‘ఇండియా కూటమి కొనసాగి తీరాలని మన కృతనిశ్చయం. మనం పార్లమెంట్‌లోను, వెలుపల సంఘటితంగా, సమన్వయంతో వ్యవహరించాలి’ అని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన సమస్యలు దేశ ప్రజలను వేధిస్తున్న సమస్యలు అని, కూటమి సభ్యులు పార్లమెంట్‌లోను వెలుపల వాటిని లేవనెత్తుతూనే ఉండాలని ఖర్గే స్పష్టం చేశారు. ‘ఇంతకు ముందు శాసనసభ ఎన్నికల్లో మనం మెరుగైన ప్రదర్శన ఇచ్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో మన ప్రవర్శనను పునరావృతం చేయలేకపోయాం. అటువంటి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక చర్చలను త్వరలో జరుపుతాం’ అని ఆయన చెప్పారు. ‘మనం సరిదిద్దే చర్యలు తీసుకోవలసి ఉంటుంది.

అవి సాంప్రదాయకంగా కాంగ్రెస్‌కు అనుకూల రాష్ట్రాలు. మనకు అవకాశాలు ఉన్నచోట్ల మన ప్రయోజనం కోసం కాకుండా మన ప్రజల ప్రయోజనార్థం మనం కృషి చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియను నేను త్వరలోనే నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నాను’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ’24 గంటలూ, 365 రోజులూ’ ప్రజల మధ్యే పార్టీ కృషి సాగుతూనే ఉంటుంది. సమస్యలను లేవదీస్తూనే ఉంటుంది’ అని ఆయన తెలిపారు. అవిశ్రాంతంగా పని చేస్తున్నందుకు పార్టీ నేతలు, కార్యకర్తలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ మణిపూర్‌లోని రెండు సీట్లను గెలుచుకుందని ఆయన తెలియజేస్తూ, పార్టీ నాగాలాండ్, అస్సాం, మేఘాలయలో కూడా సీట్లు నెగ్గిందని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మైనారిటీ వోటర్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోను, గ్రామీణ ప్రాంతాల్లోను సీట్ల సంఖ్యను పార్టీ పెంచుకుందని ఖర్గే తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కూడా పార్టీ తన ఉనికిని చాటుకోవలసి ఉంటుందని ఖర్గే సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News